రియల్టీకి భారీ రిలీఫ్‌: వడ్డీరేట్లు యథాతథం

6 Feb, 2020 12:00 IST|Sakshi

 మళ్లీ యథాతథానికే మొగ్గిన ఆర్‌బీఐ 

సాక్షి, ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వైమాసిక సమీక్షలో కీలక వడ్డీరేట్లనుయథాతథంగా ఉంచింది.  అందరూ ఊహించినట్టుగా ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లపై ఈ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు. 5.15 శాతం వద్ద, రివర్స్‌ రెపో రేటును 4.90 శాతం వద్దే ఉంచింది. గురువారం  ముగిసిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశాల్లో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆరుగురు సభ్యులతో కూడిన ఎంపీసీ కమిటీ రేట్లు యథాతథంగా ఉంచడానికే ఏకగ్రీవంగా ఓటు వేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇదే చివరి రివ్యూ.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్యూ 4 కోసం సీపీఐ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని 6.5 శాతానికి సవరించినట్టు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ మీడియాకు వివరించారు.  ఇది 2020-21 మొదటి అర్ధభాగానికి 5.4-5.0 శాతం, 2020-21 మూడవ త్రైమాసికంలో 3.2 శాతం లక్ష్యాన్ని కూడా నిర్ణయించినట్టు తెలిపారు. 2020 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ రేటు 5శాతం ఉంచింది. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం కరోనా వైరస్‌ తదితర పరిణామాల నేపథ్యంలో  యథాతయథానికి మొగ్గు  చూపినట్టు  కమిటీ వ్యాఖ్యానించింది.. ప్రధానంగా ఉల్లి ధరలలో అసాధారణ పెరగడం ద్రవ్యోల్బణం టాప్‌ టాలరెన్స్ బ్యాండ్ కంటే పైకి ఎగిసిందని ఎంపీసీ తెలిపింది. 

రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేందుకు ఆర్‌బీఐ ఈ రోజు కొన్ని చర్యలు ప్రకటించింది.  ముఖ్యంగా కమర్షియల్ ఎస్టేట్ కంపెనీల ప్రాజెక్ట్ లోన్ల వ్యవహారంలో వాణిజ్య కార్యకలాపాల (డిసీసీఓ) ప్రారంభ తేదీని మరో ఏడాది పొడిగించేందుకు నిర్ణయించింది. ప్రమోటర్ల నియంత్రణకు మించిన కారణాలతో ప్రాజెక్టులు ఆలస్యమైతే, సంబంధిత కంపెనీ ఆస్తి వర్గీకరణను తగ్గించకుండానే ఈ గడువును పొడిగించనుంది. ఆర్బీఐ తాజా నిర్ణయం రియల్‌ రంగానికి భారీ ఊరట కల్పించిందని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 7వ తేదీతో మొదలుకొని డిసెంబర్‌ 5 మధ్య జరిగిన ఆరు ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశాల సందర్భంగా చివరిసారి మినహా అంతకుముందు వరుసగా ఐదుసార్లు బ్యాంకులకు తానిచ్చే వసూలు చేసే వడ్డీరేటు– రెపోను 135 బేసిస్‌ పాయింట్లమేర ఆర్‌బీఐ తగ్గించింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు