ఆంక్షల్లేవు.. కానీ క్యాష్‌ ఏదీ?

14 Mar, 2017 00:43 IST|Sakshi
ఆంక్షల్లేవు.. కానీ క్యాష్‌ ఏదీ?

నగదు విత్‌డ్రాపై పరిమితులు ఎత్తేసిన ఆర్‌బీఐ
ఇకపై డీమోనిటైజేషన్‌ ముందునాటి పరిస్థితులు
ఏటీఎంలలో నగదుకు కటకటే!!  


న్యూఢిల్లీ: సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాల నుంచి నగదు ఉపసంహరణలపై విధించిన అన్ని పరిమితులనూ ఆర్‌బీఐ సోమవారం నుంచి తొలగించింది. దీంతో గతేడాది నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన ఆంక్షలకు తెరపడింది. ఏటీఎం నగదు ఉపసంహరణలపై విధించిన ఆంక్షలన్నీ  మార్చి 13 నుంచి తొలగిపోతాయని ఆర్‌బీఐ గతనెల్లోనే ప్రకటించింది. కరెంటు ఖాతాలు, క్యాష్‌ క్రెడిట్‌ ఖాతాలు, ఓవర్‌డ్రాఫ్ట్‌ ఖాతాల నుంచి చేసే విత్‌డ్రాయల్స్‌పై ఆంక్షలను జనవరి 30నే ఎత్తివేసింది.

ఒకటి తర్వాత ఒకటి...
గతేడాది నవంబర్‌ 8న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ రాత్రి నుంచీ ప్రజల వద్దనున్న పెద్దనోట్లు చెల్లకుండా పోయాయి. కొత్త నోట్ల కొరత ఉండడంతో ఏటీఎంలు, బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేయటంపై ఆర్‌బీఐ పరిమితులు పెట్టింది. సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాదారులు ఏటీఎం నుంచి రోజులో రూ.2,000 మాత్రమే విత్‌డ్రా చెయ్యాలని పరిమితి పెట్టి... నవంబర్‌ 14 నుంచి దీన్ని రూ.2,500కు పెంచింది. జనవరి 1 నుంచి రూ.4,500కు, జనవరి 16 నుంచి రూ.10,000కు పెంచింది. బ్యాంకు శాఖల నుంచి చేసే విత్‌డ్రాయల్స్‌కూ పరిమితులు పెట్టింది.

ఈ ఆంక్షలన్నీ ఇప్పుడు రద్దయిపోయాయి. రీమోనిటైజేషన్‌... అంటే కొత్త నోట్లను అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ ముగిసిందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ మధ్యే చెప్పారు. అయితే, ఇప్పటికీ చాలా ఏటీఎంలలో నగదుకు కటకట కొనసాగుతూనే ఉంది. బ్యాంకులు నెలకు 3 విత్‌డ్రాయల్స్‌ను మాత్రమే ఉచితంగా అనుమతిస్తూ... అంతకు మించితే ఇపుడు చార్జీలు వడ్డిస్తున్నాయి. దీంతో చాలామంది మధ్య తరగతి వారు తమ జీతం మొత్తాన్ని ఆ మూడు లావాదేవీల్లోనే తీసేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఏటీఎంలలో నగదు కొరతకు ఇదీ ఒక కారణమన్నది బ్యాంకింగ్‌ వర్గాల మాట.

డీమోనిటైజేషన్‌ ప్రకటన మర్నాడు దేశీయ స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. ఇంట్రాడేలో బీఎస్‌ఈ 1,689 పాయింట్లు, నిఫ్టీ 541 పాయింట్ల మేర పతనమయ్యాయి.
అందరూ ఏటీఎంలపై ఆధారపడుతున్నందున ప్రజల వద్ద ఉన్న నగదులో ఎక్కువ శాతం పెద్ద నోట్లే కావడంతో అవి చెల్లని పరిస్థితుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏటీఎంలు అన్నీ పనిచేయడానికి దాదాపు నెల రోజులు పట్టింది. అందుబాటులో ఉన్న ఏటీఎంలు సైతం నగదు లేక వెలవెలబోయాయి.
నగదు కొరత కారణంగా 4 లక్షల ట్రక్కులు జాతీయ రహదారులపై టోల్‌ ప్లాజాల వద్ద నిలిచిపోయాయి. పాత నోట్లను అనుమతించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే, ప్రభుత్వం స్పందించి టోల్‌ వసూళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ఆస్పత్రులు, ఆయిల్‌ కంపెనీల వద్ద పాత నోట్లు చెల్లుతాయని ప్రకటించింది.
నగదు కొరతతో పారిశ్రామికోత్పత్తి దెబ్బతింది. అక్టోబర్‌లో పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచీ 54.5 ఉండగా, నవంబర్‌లో 46.7కు పడిపోయింది.
ఆర్థిక వ్యవస్థపై నోట్ల రద్దు ప్రభావం నేపథ్యంలో జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో 7 శాతం లోపునకు పడిపోతుందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు అంచనాలు వేశాయి. కానీ, కేంద్ర గణాంక విభాగం మాత్రం మూడో త్రైమాసికంలో జీడీపీ 7 శాతంగా నమోదైనట్టు ప్రకటించింది.  
ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ దేశవ్యాప్తంగా దాడులకు దిగి డిసెంబర్‌ చివరి నాటికి లెక్కల్లో చూపని రూ.4,172 కోట్ల నల్లధనాన్ని గుర్తించింది. కొత్త నోట్లను పెద్ద మొత్తంలో పోగు చేసిన వారి నుంచి రూ.105 కోట్ల విలువ మేర సీజ్‌ చేసింది.

సాధారణ పరిస్థితే
ఏటీఎంల నుంచి మా కస్టమర్ల నగదు ఉపసంహరణలు డీమోనిటైజేషన్‌కు ముందు సాధారణంగా రూ.18,000గా ఉండేది. ఇతర బ్యాంకు కస్టమర్ల ఉపసంహరణలు రూ.10,000గా ఉండేది. ప్రస్తుత పరిస్థితి పెద్ద నోట్ల రద్దు ముందు మాదిరిగానే ఉంది.
– రాజీవ్‌ ఆనంద్, యాక్సిక్‌ బ్యాంకు

రూ.2,000 నోటంటే నో...!
కస్టమర్ల తీరు మారింది. వారిప్పుడు ఏటీఎంల నుంచి రూ.1,900 ఉపసంహరించుకోవడానికే ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల రూ.500 నోట్లు మూడు, రూ.100 నోట్లు నాలుగు వస్తాయి. రూ.2,000 నోట్లు ఉంటే తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు.
– నవరోజ్‌ దస్తూర్, ఎండీ, ఎన్‌సీఆర్‌ ఇండియా (అతిపెద్ద ఏటీఎం సంస్థ)

మరిన్ని వార్తలు