రాష్ట్రాలకు కొరవడుతున్న ఆర్థిక క్రమశిక్షణ

9 May, 2019 00:14 IST|Sakshi

ఆర్‌బీఐ హెచ్చరికలు

వ్యవసాయ రుణ మాఫీ, ఆదాయ మద్దతు పథకాల ప్రస్తావన

విద్యుత్‌ పంపిణీ కంపెనీలకు  రాయితీలూ సమస్యలో ఒకటి  

ముంబై: రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ విషయంలో జాగరూకత పాటించాల్సిన అవసరాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది. వ్యవసాయ రుణ మాఫీ, ఆదాయ మద్దతు పథకాలు, విద్యుత్‌ పంపిణీ కంపెనీలకు ఉదయ్‌ బాండ్ల వంటి అంశాలు రాష్ట్రాల ద్రవ్య స్థిరత్వానికి ఇబ్బందులను పెంచే అవకాశం ఉందని ఆర్‌బీఐ పేర్కొంది. 15వ ఆర్థిక సంఘం సభ్యులు, ఆర్‌బీఐ అధికారుల మధ్య నేడు ఇక్కడ సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. గవర్నర్‌ శక్తికాంత్‌దాస్, డిప్యూటీ గవర్నర్లు తదితర అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో చర్చలకు సంబంధించి విడుదలైన ఒక అధికారిక ప్రకటనలో ముఖ్యాంశాలు..

►సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రంసహా పలు రాష్ట్రాలు సైతం పలు ఆర్థిక వరాలు కురిపించాయి. వివిధ వర్గాల ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా అధికార పార్టీలు, ప్రతిపక్షాలు హామీలు గుప్పించాయి. ఆర్థిక క్రమశిక్షణ కోణంలో ఇది ప్రతికూలాంశమే. 
► గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఓటర్లను ఆకర్షించడానికి అలాగే పేదవర్గాలకు ఊరట కలిగించడానికి బీజేపీ పాలిత రాష్ట్రాలు పలు హామీలిచ్చాయి. గత డిసెంబర్‌లో అధికారం చేపట్టిన మూడు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు ఎన్నికల హామీలను నెరవేర్చడంలో భాగంగా ప్రజాకర్షక పథకాల అమలుకు శ్రీకారం చుట్టాయి. 
​​​​​​​► ఆయా అంశాలు ద్రవ్యలోటుకు సంబంధించి వార్షిక బడ్జెట్‌ అంచనాలను తప్పిస్తున్నాయి. 
​​​​​​​► ఆదాయాల్లో వడ్డీ చెల్లింపుల శాతం తగ్గుతున్నా... స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ప్రభుత్వ రుణ భారాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
​​​​​​​► గత డిసెంబర్‌లో ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమతులుకావడానికి ముందు 15వ ఆర్థిక సంఘంలో శక్తికాంతదాస్‌ కూడా ఒక సభ్యుడు కావడం గమనార్హం. 
​​​​​​​► మార్కెట్‌ రుణాల విషయంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలపై ఆర్‌బీఐ ప్రత్యేక ప్రజెంటేషన్‌ ఇచ్చింది. మార్కెట్‌ నుంచి నిధుల సమీకరణ, సెకండరీ మార్కెట్‌ లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) మెరుగుదల వంటి అంశాలపై సమావేశం చర్చించింది.  

మరిన్ని వార్తలు