ఎక్కడి రేట్లు అక్కడేనా

29 May, 2014 01:33 IST|Sakshi
ఎక్కడి రేట్లు అక్కడేనా

బెంగళూరు: ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో కొనసాగుతూ ఆర్థిక కార్యకలాపాలు మందకొడిగా ఉన్న నేపథ్యంలో జూన్ 3న నిర్వహించనున్న ద్రవ్య విధాన సమీక్షలో కీలక రేట్లను రిజర్వు బ్యాంకు యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని రాయిటర్స్ పోల్‌లో ఆర్థిక నిపుణులు తెలిపారు. రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా రఘురామ్ రాజన్ గత సెప్టెంబర్లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ద్రవ్యోల్బణం కట్టడికి మూడు సార్లు వడ్డీ రేట్లను పెంచారు. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వర్షపాతం సగటు కంటే తక్కువగా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో 52 మంది ఆర్థికవేత్తలతో ఈ నెల 15-27 తేదీల మధ్య నిర్వహించిన పోలింగ్‌లో ముగ్గురు మాత్రమే పాలసీ రేట్లను మారుస్తారని అభిప్రాయపడ్డారు. వీరిలో ఒకరు 25 బేసిస్ పాయింట్లు పెంచుతారని చెప్పగా, మిగిలిన ఇద్దరూ రేటును తగ్గిస్తారని పేర్కొన్నారు. రెపో రేటును 8.00 శాతం వద్దే కనీసం జనవరి వరకు కొనసాగిస్తారని ఆర్థిక నిపుణుల అంచనా.

 ఆర్థిక వృద్ధికి చర్యలను పరిశీలించే ముందు ద్రవ్యోల్బణంపై ముమ్మర నిఘాను రిజర్వు బ్యాంకు కొనసాగిస్తుందని విశ్వసిస్తున్నట్లు వీనస్ క్యాపిటల్ మేనేజింగ్ డెరైక్టర్ కె.కె.మిట్టల్ చెప్పారు. తయారీ, గనుల రంగాలు నేటికీ బలహీనంగానే కొనసాగుతున్నందువల్ల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఓ మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నట్లు బార్ల్కేస్‌కు చెందిన ఆర్థిక నిపుణుడు రాహుజ్ బజోరియా తెలిపారు. నరేంద్ర మోడీ సారథ్యంలోని వాణిజ్య మిత్ర ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆర్థిక వ్యవస్థ జోరందుకుంటుందనీ, వచ్చే ఏడాదిన్నరలో వృద్ధి రేటు పుంజుకుంటుందనీ చెప్పారు.

 డిమాండ్ కొరవడడంతో గత నెలలో దేశీయ ఉత్పాదకరంగం ఏ మాత్రం పురోగతి సాధించలేదు. సేవల రంగం వరుసగా పదో నెలలో కూడా కుచించుకుపోయింది. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించింది. దీంతో షేర్లలోనూ, రూపాయి మారకం విలువలోనూ ర్యాలీ నెలకొంది. బడ్జెట్, అభివృద్ధి, కరెంటు అకౌంటు లోటు, ద్రవ్య నిర్వహణలు ప్రధాన సమస్యలనీ, దేశీయ వాణిజ్య, పారిశ్రామిక రంగాలు ఎదుర్కొంటున్న సమస్యల పరి ష్కారానికి మోడీ అధిక ప్రాధాన్యత ఇవ్వవచ్చనీ మిట్టల్ వ్యాఖ్యానించారు.

 కీలక వడ్డీరేట్లను మార్చకపోవచ్చు: డీబీఎస్
 వచ్చేనెల మూడో తేదీన ఆర్‌బీఐ నిర్వహించనున్న ద్రవ్య విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశముందని డీబీఎస్ ఓ నివేదికలో తెలిపింది. ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలుసుకుని ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తూ అభివృద్ధికి దోహదపడే చర్యలను రిజర్వు బ్యాంకు చేపడుతోందని వివరించిన విషయాన్ని నివేదికలో ప్రస్తావించారు. రెపో రేటులో ఎలాంటి మార్పు ఉండదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రభుత్వం, ఆర్‌బీఐ వచ్చే కొన్ని నెలల్లో సంఘటితంగా కృషిచేసే అవకాశముందని డీబీఎస్ తెలిపింది. 2013-14లో దేశ ఆర్థిక వృద్ధిరేటు మందగించి 4.9 శాతానికి చేరింది.

మరిన్ని వార్తలు