ఫిబ్రవరిలో రెపో పావు శాతం కోత: హెచ్‌ఎస్‌బీసీ

14 Jan, 2017 01:20 IST|Sakshi
ఫిబ్రవరిలో రెపో పావు శాతం కోత: హెచ్‌ఎస్‌బీసీ

ముంబై: బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 6.25 శాతం) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఫిబ్రవరిలో పావు శాతం తగ్గిస్తుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ– హెచ్‌ఎస్‌బీసీ అంచనా వేస్తోంది. అయితే దీని తర్వాత రేట్ల కోతలకు బ్రేక్‌ పడే అవకాశం ఉందని కూడా పేర్కొంది.

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలులో అనిశ్చితి, కూడ్ర్‌ ఆయిల్‌ ధరలు పెరిగే అవకాశం, మధ్యకాలికంగా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ (ఫెడ్‌) రేటు పెంపు అవకాశాలు దీనికి కారణంగా వివరించింది.  పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని, జనవరి–మార్చి త్రైమాసికంలో ఈ రేటు 6 శాతానికి పెరుగుతుందని హెచ్‌ఎస్‌బీసీ అంచనావేసింది. అయితే వృద్ధి రేటు క్రమంగా పుంజుకుంటుందనీ, వచ్చే ఆర్థిక సంవత్సరం (2017–18) ఈ రేటు 7.5–8 శాతం శ్రేణి మధ్య ఉంటుందని పేర్కొంది.

>
మరిన్ని వార్తలు