మరో మూడునెలలు మారటోరియం?

18 May, 2020 19:59 IST|Sakshi

మరో మూడు నెలల పాటు మారిటోరియం పెంచే అవకాశం - ఎస్‌బీఐ పరిశోధన నివేదిక

సాక్షి, ముంబై: ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించడంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)  మరోసారి కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. తాజా నివేదికల ప్రకారం రుణాలు చెల్లింపుపై ఇప్పటికే కల్పించిన మారటోరియంను మరోసారి పొడిగించనుంది. లాక్‌డౌన్‌  పొడగింపు నేపథ్యంలో రుణాల ఈఎంఐల చెల్లింపులపై  తాత్కాలిక నిషేధాన్ని మరో మూడు నెలలు పొడిగించే అవకాశం ఉందని ఎస్‌బీఐ పరిశోధన నివేదిక తెలిపింది.

కరోనా  వైరస్ సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్థిక కలాపాలు నిలిచిపోయాయి.  చిన్నా, పెద్ద పరిశ్రమలు మూత పడ్డాయి.  దీంతో అన్ని  రకాల రుణాల చెల్లింపుపై ఆర్‌బీఐ ఊరటనిచ్చింది.  మార్చి 1, 2020 , మే 31, 2020 మధ్య చెల్లించాల్సిన బకాయిలపై మూడు నెలల తాత్కాలిక నిషేధాన్ని అనుమతించింది. దీని ప్రకారం 2020 ఆగస్టు 31 వరకు కంపెనీలు చెల్లించనవసరం లేదు. అయితే  తాజాగా లాక్‌డౌన్‌ మే 31 వరకు పొడిగించడంతో ఈ వెసులుబాటును మరో మూడు నెలలు పొడిగించాలని భావిస్తోంది.

రుణ గ్రహీతలకు తక్షణమే తగు ఆదాయాలు వచ్చే అవకాశం లేకపోవడంతో గడువు లోపల (సెప్టెంబరులో) ఆయా కంపెనీలు చెల్లించాల్సినవి వడ్డీతో కలిపి చెల్లించే అవకాశాలు చాలా తక్కువగా వుంటాయని ఎస్‌బీఐ పరిశోధన  అంచనా వేసింది.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న రుణాల సమగ్ర పునర్నిర్మాణం, రీ క్లాసిఫికేషన్ కోసం బ్యాంకులకు 90 రోజుల గడువు ఇవ్వాల్సిన అవసరం ఉందని నివేదిక తెలిపింది.  అయితే వడ్డీతో కలిపి లోన్లను తిరిగి చెల్లించడంలో విఫలమైతే, నిబంధనల ప్రకారం అలాంటి వారి ఖాతాను నిరర్ధక రుణాలుగా వర్గీకరించవచ్చు. వర్కింగ్ క్యాపిటల్ విస్తరణను కోవిడ్-19 అప్పుగా పరిగణిస్తుందో లేదో కూడా ఆర్‌బీఐ స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీనిపై ఆర్‌బీఐ అధికారికంగా ప్రకటించాల్సి వుంది.  (వాళ్లను అలా వదిలేయడం సిగ్గు చేటు - కిరణ్‌ మజుందార్‌ షా)

కరోనా వైరస్ మహమ్మారి కట్టడిగా గాను ముందుగా  జనతా కర్ఫ్యూను , అనంతరం  21 రోజుల లాక్‌డౌన్‌ను  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ప్రకటించారు.  అయితే  వైరస్ తగ్గుముఖం పట్టకపోడంతో  దీన్ని  మే 3 వరకు ఆ తర్వాత మళ్ళీ మే 17 వరకు పొడిగించింది.  కేంద్రం తాజాగా లాక్‌డౌన్‌ 4.0ను మే 31వరకు పొడిగించిన విషయం తెలిసిందే.  (శాశ్వతంగా ఇంటినుంచేనా? నో...వే..)

మరిన్ని వార్తలు