దేశీ కరెన్సీకి ఆర్‌బీఐ బూస్ట్ : రిజర్వ్ బ్యాంక్

17 Jul, 2013 03:32 IST|Sakshi
దేశీ కరెన్సీకి ఆర్‌బీఐ బూస్ట్ : రిజర్వ్ బ్యాంక్

- 58 పైసలు బలపడిన రూపాయి
- 59.31 వద్ద ముగింపు

ముంబై: కరెన్సీ మారకంలో భారీ హెచ్చుతగ్గులను నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న చర్యలతో రూపాయికి ఊతం లభించింది. మంగళవారం డాలర్‌తో పోలిస్తే ఏకంగా 58 పైసలు బలపడి 59.31 వద్ద ముగిసింది. ఈ స్థాయిలో రూపాయి పెరగడం పక్షం రోజుల్లో ఇదే తొలిసారి. జూన్ 28న రూపాయి అత్యధికంగా 80 పైసల మేర బలపడింది.

మంగళవారం ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 59.89తో పోలిస్తే మెరుగ్గా 59.20 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. తర్వాత ఒక దశలో 59.14కి కూడా ఎగసింది. చివరికి 0.97 శాతం లాభంతో 59.31 వద్ద ముగిసింది. రానున్న రోజుల్లో రూపాయి 58 స్థాయికి పెరగగలదని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు.

లిక్విడిటీని కట్టడి చేయడం ద్వారా కరెన్సీ హెచ్చుతగ్గులను నియంత్రించేందుకు ఆర్‌బీఐ చర్యలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బ్యాంకులు తన వద్ద తీసుకునే రుణాలపై వడ్డీని పెంచడంతో పాటు.. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా రూ. 12,000 కోట్ల మేర బాండ్లను విక్రయించనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. జూలై 8న ఆల్‌టైం కనిష్టమైన 61.21కి పడిపోయిన రూపాయికి స్వల్పకాలికంగా ఈ చర్యలు కాస్త ఊతమివ్వగలవని విశ్లేషకులు తెలిపారు.

మరిన్ని వార్తలు