ఆర్‌బీఐ పాలసీ సమావేశం ప్రారంభం

6 Feb, 2019 05:27 IST|Sakshi

గురువారం వడ్డీరేట్లపై కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మూడు రోజుల ద్రవ్య పరపతి విధాన సమీక్ష మంగళవారం ప్రారంభమైంది. గురువారంనాడు కీలక నిర్ణయాలను వెలువరించనుంది. 2018–19 ఆరవ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష ఇది. గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలో మొట్టమొదటిసారి సమావేశమవుతున్న ఆరుగురు సభ్యుల పరపతి విధాన మండలి ఈ దఫా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం) మార్చకపోవచ్చని విశ్లేషణలు ఉన్నాయి.

అయితే ద్రవ్యోల్బణం దిగువ స్థాయిలో ఉన్నందున, పాలసీకి సంబంధించి తన పూర్వ ‘జాగరూకతతో కూడిన కఠిన’ వైఖరిని ‘తటస్థం’ దిశగా సడలించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. గత డిసెంబర్‌ పరపతి విధాన సమీక్ష సందర్భంగా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించన ఆర్‌బీఐ, ద్రవ్యోల్బణం ఇబ్బందులు తొలిగితే, రేటు తగ్గింపు చర్యలు ఉంటాయని సూచించింది. దేశ పారిశ్రామిక రంగం మందగమన స్థితిలో ఉండడం వల్ల రేటు విషయంలో ఆర్‌బీఐ కొంత సరళతర వైఖరి ప్రదర్శించవచ్చన్న అభిప్రాయం ఉంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండుసార్లు ఆర్‌బీఐ రేట్లు పెరిగాయి.   

రేటు తగ్గింపు వెసులుబాటు...
ఆర్‌బీఐకి రేటు కోతకు వెసులుబాటు ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ అభిప్రాయపడింది. తగ్గిన క్రూడ్‌ ధరలు, ద్రవ్యోల్బణానికి సానుకూలత అంశాలు తన విశ్లేషణకు కారణమని తాజా నివేదికలో పేర్కొంది.

ఆర్‌బీఐ నుంచి రూ.69,000 కోట్లు
ఆర్‌బీఐ నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.69,000 కోట్లు డివిడెండ్‌గా రావచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే రూ.40,000 కోట్లను డివిడెండ్‌గా పంపిణీ చేసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు