మరిన్ని అధికారాలు ఇవ్వండి..

13 Jun, 2018 00:31 IST|Sakshi

అప్పుడే పీఎస్‌బీలను సమర్ధంగా నియంత్రించగలం

ప్రతి బ్యాంకు శాఖను ఆడిట్‌ చేయడం అసాధ్యం

పార్లమెంటరీ కమిటీకి ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: మొండిబాకీలు, స్కామ్‌లు, నష్టాలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీ) సమర్ధంగా నియంత్రించాలంటే తమకు మరిన్ని అధికారాలు ఇవ్వాల్సి ఉంటుందని పార్లమెంటరీ కమిటీకి రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ స్పష్టం చేశారు.

పీఎస్‌బీల చైర్మన్, డైరెక్టర్, సీఈవోలను తొలగించడం మొదలు ఆయా బ్యాంకుల బోర్డుల్లో డైరెక్టర్లపై ఆంక్షలు విధించడం దాకా దాదాపు పదికి పైగా కీలక అంశాల్లో తమకు పూర్తి అధికారాలు లేవని ఆయన చెప్పారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వీరప్ప మొయిలీ సారథ్యంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం (ఆర్థిక)తో మంగళవారం భేటీ అయిన సందర్భంగా పటేల్‌ ఈ విషయాలు పేర్కొన్నారు.

సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. మొండిబాకీలు, బ్యాంకుల్లో మోసాలు, నగదు కొరత వంటి పలు అంశాలపై స్థాయీ సంఘం నుంచి పటేల్‌కు కఠిన ప్రశ్నలు ఎదురయ్యాయి. మరోవైపు, దివాలా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి మొండిబాకీల రికవరీ మెరుగుపడుతోందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థను పటిష్టం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు.  

బోర్డుల్లో ఆర్‌బీఐ నామినీలు ఉండకూడదు..
బ్యాంకులను సమర్ధంగా నియంత్రించాలంటే వాటి బోర్డుల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ నామినీ డైరెక్టర్లు ఉండకూడదని స్థాయీ సంఘానికి పటేల్‌ తెలిపారు. దీనిపై ఆర్థిక శాఖతో సంప్రతింపులు జరుగుతున్నాయని వివరించారు.

ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డుల పనితీరును మెరుగుపర్చేందుకు నాయక్‌ కమిటీ సిఫార్సులను సత్వరం అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. బోర్డు స్వతంత్ర హోదాను మరింత పటిష్టం చేసేందుకు, మేనేజ్‌మెంట్‌పై పర్యవేక్షణను పెంచేందుకే చైర్మన్‌.. సీఈవో/ఎండీ పదవులను విడగొట్టినట్లు పటేల్‌ తెలిపారు.  

మోసాల నియంత్రణ బాధ్యత బోర్డులదే..
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)లో రూ. 13,000 కోట్ల కుంభకోణం గురించి కూడా పటేల్‌ వివరణ ఇచ్చారు. ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకుల్లో గవర్నెన్స్‌ లోపాలపైనా స్థాయీ సంఘం ప్రశ్నించింది. ప్రతి బ్యాంకు శాఖను ఆర్‌బీఐ ఆడిట్‌ చేయడం అసాధ్యమని స్పష్టం చేసిన పటేల్‌.. మోసాలకు తావులేకుండా బ్యాంకులు సమర్ధంగా నడిచేలా చూడటమనేది వాటి బోర్డుల్లోని డైరెక్టర్ల ప్రాథమిక, సమష్టి బాధ్యత అని పేర్కొన్నారు. అటు డీమోనిటైజేషన్, ఆ తర్వాత బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి మళ్లీ ఎంత మొత్తం నగదు తిరిగి వచ్చిం దన్న ప్రశ్నలకు పటేల్‌ నుంచి సంతృప్తికరమైన సమాధానం లభించలేదని సమచారం.

మరిన్ని వార్తలు