యస్‌ బ్యాంక్‌ కపూర్‌కు ఆర్‌బీఐ నో

20 Sep, 2018 00:43 IST|Sakshi

సీఈఓ బాధ్యతల నుంచి రాణా కపూర్‌ తప్పుకోవాల్సిందే! 

2019 జనవరి 31 తుది గడువు   

న్యూఢిల్లీ: ఎస్‌ బ్యాంక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) రాణా కపూర్‌ పదవీకాలాన్ని బ్యాంకింగ్‌ రెగ్యులేటర్‌– రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కుదించింది. 2019 జనవరి 31 నాటికి ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని ప్రైవేటు దిగ్గజ బ్యాంక్‌కు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 2004లో బ్యాంకును ప్రారంభించిన నాటి నుంచీ రాణా కపూర్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2021 ఆగస్టు 31 వరకూ పదవీ కాలాన్ని పొడిగించాలని కపూర్‌ చేసిన విజ్ఞప్తిని ఆర్‌బీఐ తిరస్కరించింది. 2019 జనవరి వరకే కొనసాగడానికి అనుమతిని ఇచ్చింది.   

25న బ్యాంక్‌ బోర్డ్‌ సమావేశం... 
అయితే ఈ అంశంపై చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించడానికి బ్యాంక్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు ఈ నెల 25న సమావేశం కానున్నారు. యస్‌ బ్యాంక్‌ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్‌బీఐ తుది ఆమోదానికి లోబడి, కపూర్‌ పదవీ కాలాన్ని మరో మూడేళ్లు పొడిగించడానికి ఈ ఏడాది జూన్‌లో బ్యాంక్‌ షేర్‌హోల్డర్లు ఆమోదముద్ర వేశారు. నిజానికి ఆయన ప్రస్తుత పదవీకాలం ఆగస్టు 31తో ముగిసింది. అయితే తదుపరి నోటీసు వచ్చే వరకూ బాధ్యతల్లో కొనసాగడానికి ఆగస్టు 30న ఆర్‌బీఐ అనుమతి జారీచేసింది. అప్పట్లో నిర్దిష్ట సమయాన్ని వెల్లడించని ఆర్‌బీఐ, తాజాగా ఇందుకు 2019 జనవరిని తుది గడువుగా ప్రకటించింది. ప్రమోటర్‌గా కపూర్‌ ఆయన కుటుంబానికి బ్యాంక్‌లో 10.66 శాతం వాటా ఉంది.  

శిఖా తరహాలోనే...: గతంలో ప్రైవేటు రంగ  దిగ్గజ బ్యాంక్‌ యాక్సిస్‌ బ్యాంక్‌– సీఈఓ శిఖా శర్మ పదవీ కాలం మూడేళ్ల పొడిగింపునకు బోర్డ్‌ ఆమోదముద్ర వేసింది. దీనికి ఆర్‌బీఐ అంగీకరించలేదు.

మరిన్ని వార్తలు