ఫలితాలు, ఆర్‌బీఐ పాలసీ కీలకం

31 Jul, 2017 01:00 IST|Sakshi
ఫలితాలు, ఆర్‌బీఐ పాలసీ కీలకం

రేట్ల కోతపై మార్కెట్‌ దృష్టి
కంపెనీల ఫలితాలూ కీలకమే..
మార్కెట్‌పై నిపుణుల అంచనా...


ఆర్‌బీఐ పాలసీ, ఈ వారంలో వెలువడే కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్‌  మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. వీటితో పాటు ఈవారంలో వెలువడే  ఆర్థిక గణాంకాలు, ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల పోకడ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి తదితర అంశాలు కూడా స్టాక్‌ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని వారంటున్నారు.

నేడు రిలయన్స్‌ పవర్‌ ఫలితాలు..
నేడు (సోమవారం) రిలయన్స్‌ పవర్, శ్రీ సిమెంట్, సీమెన్స్‌ తదితర కంపెనీలు క్యూ1 ఫలితాలను వెల్లడిస్తాయి. మంగళవారం (ఆగస్టు 1న)  టెక్‌  మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మ్యారికో, పిరమళ్‌ ఎంటర్‌ప్రైజెస్, పవర్‌గ్రిడ్‌ కంపెనీలు, ఆగస్టు 2న(బుధవారం) లుపిన్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, బాటా ఇండియా, గోద్రెజ్‌ ప్రోపర్టీస్, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీలు, గురువారం(ఆగస్టు 3న) ఇండియన్‌ ఆయిల్‌ కార్పొ, కాల్గేట్‌ పామోలివ్, టైటాన్‌ కంపెనీలు, ఆగస్టు 4న (శుక్రవారం) మహీంద్రా,  డాబర్‌ ఇండియా కంపెనీలు తమ తమ క్యూ1 ఫలితాలను వెల్లడిస్తాయి.

ఆర్‌బీఐ పాలసీపై అందరి కళ్లు..
ఈ బుధవారం ఆర్‌బీఐ పాలసీ వెలువడనున్నది. ఈ పాలసీలో రేట్ల కోత విషయమై ఆర్‌బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని మార్కెట్‌ జాగ్రత్తగా గమనిస్తుందని శామ్‌కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమిత్‌ మోడి చెప్పారు. మరోవైపు మంగళవారం(ఆగస్టు 1న) తయారీ రంగానికి సంబంధించి పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌(పీఎంఐ) గణాంకాలు వస్తాయి.  గురువారం (ఆగస్టు 3న) సేవల రంగానికి సంబంధించి పీఎంఐ గణాంకాలు వెలువడుతాయి.

జూలైలోనూ జోరు తగ్గని విదేశీ పెట్టుబడులు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) జూలైలోనూ భారత క్యాపిటల్‌ మార్కెట్లో జోరుగానే పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో మన ఈక్విటీ మార్కెట్లో రూ.7,611 కోట్లు, డెట్‌ మార్కెట్లో రూ.18,599 కోట్లు వెరశి మన క్యాపిటల్‌ మార్కెట్లో రూ.26,210 కోట్లు చొప్పున పెట్టుబడులు పెట్టారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే మన దేశంలోనే వృద్ధి అవకాశాలు ఉత్తమంగా ఉండటంతో  ఈ స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయని ఫండ్స్‌ ఇండియాడాట్‌కామ్‌ రీసెర్చ్‌ హెడ్‌ విద్యా బాల పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు