ఆర్‌బీఐ పాలసీ సమీక్ష షురూ

4 Jun, 2019 07:01 IST|Sakshi

కీలక వడ్డీ రేట్లపై 6న నిర్ణయం వెల్లడి

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో ద్వైమాసిక పరపతి విధాన సమీక్షను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆరంభించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సారథ్యంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సోమవారం సమాలోచనలు మొదలెట్టింది. జూన్‌ 3 నుంచి 6 దాకా సమావేశం జరుగుతుందని, 6న ఉదయం 11.45 గం.లకు ఆర్‌బీఐ వెబ్‌సైట్లో ఎంపీసీ తీర్మానాన్ని ఉంచుతామని రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. గడిచిన రెండు సమీక్షల్లోనూ పావు శాతం మేర రెపో రేటు తగ్గించిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ సారి కూడా ఎకానమీకి ఊతమిచ్చేలా మరో పావు శాతం తగ్గింపును ప్రకటించే అవకాశం ఉందని అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షపైనే అందరి దృష్టి ఉంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత ఆర్‌బీఐ పాలసీ సమీక్ష జరపడం ఇదే తొలిసారి. వ్యవసాయం, తయారీ రంగాల పనితీరు నిరాశాజనకంగా ఉండటంతో 2018–19 నాలుగో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి అయిదేళ్ల కనిష్టమైన 5.8 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. రెపో రేటు ప్రస్తుతం 6 శాతంగా ఉంది. 

ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగిస్తున్న నేపథ్యంలో ఎకానమీకి ఊతమిచ్చేలా రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక వడ్డీ రేట్లను మరింతగా తగ్గించాల్సిన అవసరం ఉందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఎండీ ఉదయ్‌ కోటక్‌ అభిప్రాయపడ్డారు. అయితే ఈ తగ్గింపు.. ఇటు డిపాజిట్, అటు రుణాలపై వడ్డీ రేట్లలో సరిగ్గా ప్రతిఫలించేలా చర్యలు తీసుకోవడం సవాలుతో కూడుకున్నదని చెప్పారు. ద్రవ్యోల్బణం కాస్త సానుకూల స్థాయిల్లోనే ఉన్నందున ఆర్థిక కార్యకలాపాలకు తోడ్పాటునిచ్చేలా వడ్డీ రేట్లను తగ్గించే అంశాన్ని ఆర్‌బీఐ పరిశీలించవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. ‘ద్విచక్ర వాహనాలు, కార్లతో పాటు వివిధ వినియోగ ఉత్పత్తుల అమ్మకాలు, ఉత్పత్తి మందగించిన నేపథ్యంలో ఎకానమీకి ఊతమిచ్చేందుకు వడ్డీ రేట్లను తగ్గించడం అవసరం’ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ పేర్కొన్నారు. ప్రస్తుత మందగమనాన్ని ఎదుర్కొనేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ కేవలం పావు శాతానికే పరిమితం కాకుండా కీలక పాలసీ రేటులో మరింత ఎక్కువగా కోత పెట్టాల్సిన అవసరం ఉందని ఎస్‌బీఐ ఇటీవలే ఒక అధ్యయన నివేదికలో పేర్కొంది.

మరిన్ని వార్తలు