ఇక 'వడ్డిం'పు షూరూ..!

7 Jun, 2018 00:43 IST|Sakshi

ఇంటి, వాహన, వ్యక్తిగత రుణాలు ఇక ప్రియం...

నాలుగున్నరేళ్ల తర్వాత తొలిసారి వడ్డీరేటు పెంపు...

పావు శాతం పెరిగిన రెపో రేటు; 6.25 శాతం

రివర్స్‌ రెపో కూడా పావు శాతం పెంపుతో 6 శాతానికి...

ఎంపీసీ భేటీలో ఏకగ్రీవ నిర్ణయం...

జీడీపీ వృద్ధి అంచనా 7.4 శాతంగానే కొనసాగింపు...

క్రూడ్‌ ధరల జోరుతో ద్రవ్యోల్బణం పెరగొచ్చని అంచనా...

ప్రస్తుతానికి పరపతి విధానం ‘తటస్థం’గానే ఉంటుందని వెల్లడి  

వడ్డీరేట్ల విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) మరోసారి అందరి అంచనాలను తలకిందులు చేసింది. దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత అనూహ్యంగా కీలక పాలసీ రేట్లను పెంచింది. అంతర్జాతీయంగా అంతకంతకూ పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావంతో దేశీయంగా ద్రవ్యోల్బణం ఎగబాకే ప్రమాదం పొంచి ఉండటమే వడ్డీరేట్ల పెంపునకు ప్రధాన కారణంగా పేర్కొంది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లు కూడా పెరగనున్నాయి. ఖాతాదారులు చెల్లించే నెల వాయిదాలు (ఈఎంఐ) భారం కానున్నాయి. కాగా, మోదీ సర్కారు హయాంలో ఇది ఆర్‌బీఐ మొట్టమొదటి రేట్ల పెంపు కావడం విశేషం.

ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి కట్టడి చేస్తాం...
రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని మధ్యకాలికంగా 4 శాతానికి (రెండు శాతం అటు ఇటుగా) కట్టడి చేయాలన్నదే తమ లక్ష్యమని ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ పేర్కొన్నారు. వృద్ధి ఊతమిస్తూనే ఈ లక్ష్యానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. దీనికి అనుగుణంగానే ప్రస్తుతానికి తటస్థ పాలసీనే కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించినట్లు ఆయన వివరించారు. ‘దేశీయంగా ఆర్థిక  కార్యకలాపాలు కొద్ది నెలలుగా పుంజుకున్నాయి. ఉత్పాదకతకు సంబంధించిన తగ్గుముఖం ధోరణి దాదాపు ముగిసినట్లే. కార్పొరేట్ల పెట్టుబడుల్లో కూడా మెరుగైన రికవరీయే కనబడుతోంది. దివాలా చట్టంతో మొండిబకాయిలకు సత్వర పరిష్కారం లభించే అవకాశం ఉంది.  భౌగోళిక–రాజకీయ రిస్కులు, ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్‌ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు, రక్షణాత్మక వాణిజ్య విధానాలు దేశీ ఆర్థిక వ్యవస్థ రికవరీకి అడ్డంకులు సృష్టించే ప్రమాదం పొంచి ఉంది’ అని ఉర్జిత్‌ పటేల్‌ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుదల రిస్కులపై ఆర్‌బీఐ అప్రమత్తత కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.7%కి(ఏడు క్వార్టర్ల గరిష్టం), పూర్తి ఏడాదికి 6.7%కి వృద్ధి చెందిన సంగతి తెలిసిందే.

ఎగవేతదారులపై  మరో అస్త్రం.. పీసీఆర్‌!
రుణ ఎగవేతదారులను గుర్తించడం ప్రధాన లక్ష్యంగా ‘పబ్లిక్‌ క్రెడిట్‌ రిజిస్ట్రీ (పీసీఆర్‌)’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. రుణ గ్రహీతల సమాచారం అంతా పీసీఆర్‌లో నమోదవుతుంది. వారి రుణ చరితను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ... అప్రమత్తం చేయడం రిజిస్ట్రీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. యశ్వంత్‌ ఎం దేవస్థాలి నేతృత్వంలోని ఒక ఉన్నతస్థాయి కమిటీ సిఫారసులకు అనుగుణంగా పీసీఆర్‌ను ఏర్పాటుచేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. రిజిస్ట్రీ విధివిధానాలు, పనితీరు వంటివి ఖరారుకు తొలిదశలో ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ (ఐటీఎఫ్‌) ఏర్పాటవుతుంది. ప్రస్తుతం దేశంలో పలు క్రెడిట్‌ సమాచార విభాగాలున్నా.. కొన్ని నిర్దిష్ట కార్యకలాపాలు, లక్ష్యాల మేరకే ఇవి పనిచేస్తున్నాయి. 

చిన్న బ్యాంకులుగా సహకార బ్యాంకులు!
సహకార బ్యాంకులకు త్వరలో చిన్న తరహా బ్యాంకుల హోదా(స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్స్‌) లభించే అవకాశాలు ఉన్నాయి. చిన్న బ్యాంకులుగా పట్టణ సహకార బ్యాంకుల(యూసీబీ)  మార్పిడికి సంబంధించి ఆర్‌బీఐ త్వరలో ఒక పథకాన్ని  ఆవిష్కరిస్తుందని డిప్యూటీ గవర్నర్‌ ఎన్‌ఎస్‌ విశ్వనాథన్‌ సూచించారు. దీనికి సంబంధించి కొన్ని వర్గాల నుంచి ఆర్‌బీఐకి విజ్ఞప్తులు వస్తున్నట్లు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయడానికి, ఇందులో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఆర్‌బీఐ ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. ఈ విషయంలో ప్రజాభిప్రాయం సేకరణకుగాను సెప్టెంబర్‌ 30న ఆర్‌బీఐ ఒక విధాన పత్రాన్ని విడుదల చేస్తుందని డిప్యూటీ గవర్నర్‌ తెలిపారు.  

ఆర్థిక వృద్ధికి విఘాతం: పరిశ్రమ వర్గాలు
ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంపై పారిశ్రామిక రంగం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలకు గండిపడుతుందని  పేర్కొన్నారు. ‘సరఫరాపరమైన అడ్డంకులే ప్రస్తుత ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణం. రేట్ల పెంపుతో వృద్ధికి విఘాతం కలుగుతుంది. రానున్న కాలంలో వృద్ధికి మద్దతుగా ఆర్‌బీఐ మళ్లీ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని భావిస్తున్నాం’ అని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ పేర్కొన్నారు. ‘పరిశ్రమతోపాటు చాలా మందికి ఆర్‌బీఐ కఠిన వైఖరి రుచించకపోవచ్చు. అయినా, స్వల్పకాలానికి ఆర్‌బీఐ వడ్డీరేట్లలో పెరుగుదల కొనసాగే అవకాశం ఉంది’ అని అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ డీఎస్‌ రావత్‌ చెప్పారు. ‘ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వడ్డీరేట్ల ధోరణి, క్రూడ్‌ ధరల జోరు, అధిక ద్రవ్యోల్బణం వల్లే ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచింది. రియల్టీ రంగంపై (ఇళ్ల కొనుగోళ్లు) ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. దీర్ఘకాలంలో రేట్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది’ అని నరెడ్కో జాతీయ అధ్యక్షుడు నిరంజన్‌ హిరనందాని వ్యాఖ్యానించారు.

ముఖ్యాంశాలు ఇవీ...
►బ్యాంక్‌ రేటు 6.5 శాతం, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌) 4 శాతంగా కొనసాగుతాయి. మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్‌) రేటు 6.5 శాతంగా ఉంటుంది.
►కార్పొరేట్‌ పెట్టుబడుల్లో రికవరీ మెరుగ్గానే ఉంది. దివాలా చట్టంతో మొండిబకాయిల పరిష్కారానికి తోడ్పాటు.
►ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పిత్తి(జీడీపీ) వృద్ధి రేటు గతంలో అంచనా వేసిన విధంగానే 7.4 శాతంగా ఉంటుంది.
►అంతర్జాతీయంగా పొంచిఉన్న రాజకీయ–భౌగోళికపరమైన రిస్కులు, ఫైనాన్షియల్‌ మార్కెట్లలో కుదుపులు, అమెరికాతో సహా పలు దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక వాణిజ్య విధానాలు మన ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
►తదుపరి పాలసీ సమీక్ష నిర్ణయం ఆగస్టు 1న వెలువడుతుంది.

సరైన దిశలో చర్యలు..
అందుబాటు గృహాలకిచ్చే రుణాలకు పరిమితులను పెంచడం, ఎంఎస్‌ఎంఈ సంస్థలు సంఘటిత రంగంలో భాగమయ్యేలా ప్రోత్సహించే చర్యలు సరైన దిశలో తీసుకున్నవే. ఎస్‌డీఎల్‌ వేల్యుయేషన్‌ నిబంధనల్లో మార్పులు.. దీర్ఘకాలికంగా సానుకూలమైనవి. ఎఫ్‌ఏఎల్‌ఎల్‌సీ నిష్పత్తిని పెంచడం వల్ల బ్యాంకులకు మరింత లిక్విడిటీ లభిస్తుంది.
– రజనీష్‌ కుమార్, చైర్మన్, ఎస్‌బీఐ

ఆర్థిక స్థిరత్వానికి తోడ్పాటు
ఆర్‌బీఐ సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాలు.. ద్రవ్యోల్బణ అంచనాలు స్థిరంగా ఉండేలా చూసేందుకు తోడ్పడతాయి. ఇవి ఆర్థిక స్థిరత్వం సాధించడానికి ఉపయోగపడగలవు.
– చందా కొచర్, ఎండీ, ఐసీఐసీఐ బ్యాంక్‌

ద్రవ్యోల్బణ కట్టడి..
రేట్ల పెంపు నిర్ణయం..  ద్రవ్యోల్బణాన్ని 4%స్థాయిలో కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది.   పెరుగుతున్న ముడి చమురు రేట్లు వంటి అంశాలతో అంతర్జాతీయంగా అనిశ్చితి కారణంగానే రేట్ల పెంచి ఉంటారని భావిస్తున్నా.
– రాణా కపూర్, ఎండీ, యస్‌ బ్యాంక్‌ 

మరిన్ని వార్తలు