మరో విడత ఆర్‌బీఐ రేట్ల కోతకు చాన్స్‌

1 Jun, 2019 07:39 IST|Sakshi

దేశ జీడీపీ వృద్ధి రేటు మార్చి త్రైమాసికంలో ఐదేళ్ల కనిష్ట స్థాయి 5.8 శాతానికి పడిపోయిన నేపథ్యంలో జూన్‌ తొలి వారంలో జరిగే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆర్‌బీఐ ఎంపీసీ ప్రకటనలో రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు–ప్రస్తుతం 6 శాతం)ను పావు శాతం మేర (25 బేసిస్‌ పాయింట్లు) తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు బలంగా అంచనా వేస్తున్నారు. జీడీపీ వృద్ధి రేటు జనవరి–మార్చి త్రైమాసికంలో 6.1 శాతానికి తగ్గొచ్చన్నది డీబీఎస్‌ గ్రూపు అంచనా వేసినా అంతకన్నా తక్కువకు ఈ రేటు పడిపోయిన విషయం గమనార్హం.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ ఎంపీసీ రెండో ద్వైమాసిక సమీక్షా సమావేశం జూన్‌ 3న ప్రారంభమై 6న ముగుస్తుంది. 5న సెలవుదినం కావడంతో 6వ తేదీన ప్రకటన విడుదల కానుంది. ‘‘జీడీపీ వృద్ధి గణాంకాలను బట్టి ఆర్‌బీఐ పాలసీ కమిటీ జూన్‌ 6న రేట్లను నిర్ణయిస్తుంది. రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 5.75 శాతం చేస్తుందని భావిస్తున్నాం. దీంతో కలిపితే 2019లో 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్టు అవుతుంది’’ అని డీబీఎస్‌ నివేదిక పేర్కొంది. ఆర్‌బీఐ ఎంపీసీ ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌ సమీక్షల్లో పావు శాతం చొప్పున మొత్తం అర శాతం మేర రేట్లను తగ్గించిన విషయం గమనార్హం.  

35–50 బేసిస్‌ పాయింట్ల వరకూ: ఎస్‌బీఐ రీసెర్చ్‌
ఎస్‌బీఐకి చెందిన పరిశోధన విభాగం సైతం జీడీపీ రేటు మార్చి త్రైమాసికంలో 6.1 శాతానికి పడిపోతుందని తన తాజా ఎకోరాప్‌ నివేదికలో అంచనా వేసింది. అయితే దీనికంటే తక్కువరేటు నమోదయ్యింది.  2018–19లో వృద్ధి రేటు 6.9 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. అయితే, విశ్లేషకుల అంచనాల కంటే వృద్ధి గణాంకాలు ఇంకా తక్కువగానే ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ రెపో రేటును 35–50 బేసిస్‌ పాయింట్ల వరకూ తగ్గించొచ్చన్నది ఎస్‌బీఐ ఎకోరాప్‌ అంచనా. ఎప్పుడూ 25 బేసిస్‌ పాయింట్లు లేదంటే దానికి రెట్టింపు అన్న విధానంలో కాకుండా మధ్యస్థంగా తగ్గించడం ద్వారా భవిష్యత్తు పాలసీ విధానంపై కొత్త సంకేతాలు పంపొచ్చని అభిప్రాయపడింది.

లిక్విడిటీ పెంపు చర్యలు
‘‘ఎన్నికల ఫలితాలు నిర్ణయాత్మకంగానే ఉండడంతో ఇప్పుడు దృష్టి ద్రవ్య, మానిటరీ పాలసీపైకి మళ్లింది. వృద్ధి పెంపునకు ఉత్ప్రేరకంగా నిలవడంతోపాటు, వినియోగం, ప్రైవేటు పెట్టుబడులను పెంచే విధంగా పాలసీ ఉండాలి’’ అని కోటక్‌ మహీంద్రా బ్యాంకు ప్రెసిడెంట్‌ శక్తి ఏకాంబరం తెలిపారు. రేట్లను 25–50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించడంతోపాటు లిక్విడిటీ పెంపు చర్యలను కూడా ఆశించొచ్చన్నారు. బడ్జెట్‌ నిర్ణయాలతో ద్రవ్య పరిస్థితుల తీరును, ఖర్చులను ఆర్‌బీఐ పరిశీలిస్తుందన్నారు. అలాగే, అంతర్జాతీయ అంశాలు, వాణిజ్య ఉద్రిక్తతలు, చమురు ధరలను కూడా పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. ఇక రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా మాత్రం ఆర్‌బీఐ కీలక రేట్ల విషయంలో యథాతథ స్థితినే కొనసాగించొచ్చని పేర్కొంది. వేచి చూసే ధోరణితో జూలైలో బడ్జెట్‌ సమయంలో ద్రవ్య విధానాలపై ప్రభుత్వ ప్రకటనలను పరిశీలించొచ్చని తెలిపింది. ‘‘ఎంపీసీ ఇప్పటికే వరుస తగ్గింపులను చేపట్టింది. ఈ తగ్గింపుల వల్ల రుణాల రేట్లు తగ్గడం, రుణాల జారీ పెరగడం అన్నది ఇంకా ఆచరణలో కనిపించాల్సి ఉంది’’ అని ఇక్రా పేర్కొంది.

>
మరిన్ని వార్తలు