సీఈవోకు 70 ఏళ్లు..!

13 Jun, 2020 03:58 IST|Sakshi

హోల్‌టైమ్‌ డైరెక్టర్లకు కూడా

ప్రమోటర్లకు గరిష్టంగా 10 ఏళ్లు

వయోపరిమితులపై ఆర్‌బీఐ చర్చాపత్రం

బ్యాంకింగ్‌లో గవర్నెన్స్‌ మెరుగుపర్చేందుకు చర్యలు

ముంబై: బ్యాంకింగ్‌ రంగంలో గవర్నెన్స్‌ను మెరుగుపర్చే దిశగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పలు చర్యలు ప్రతిపాదించింది. వీటి ప్రకారం బ్యాంకుల సీఈవోలు, హోల్‌టైమ్‌ డైరెక్టర్లకు గరిష్ట వయోపరిమితి 70 ఏళ్లుగా ఉండనుంది. అలాగే ప్రమోటర్‌ కుటుంబానికి చెందిన వారికి గరిష్టంగా 10 ఏళ్ల పదవీకాలం ఉంటుంది. ఆ తర్వాత నిర్వహణ సారథ్య బాధ్యతలను ప్రొఫెషనల్స్‌కు ప్రమోటర్‌ గ్రూప్‌ అప్పగించాలి. ‘బ్యాంకుల సీఈవో/హోల్‌టైమ్‌ డైరెక్టర్ల గరిష్ట వయో పరిమితి 70 ఏళ్లుగా ఉంటుంది.

ఆ తర్వాత ఆ పోస్టులో కొనసాగడానికి వీల్లేదు. అంతర్గత విధానం కింద కావాలంటే అంతకన్నా తక్కువ వయోపరిమితి కూడా నిర్దేశించుకోవచ్చు. ఇక సీఈవో లేదా హోల్‌టైమ్‌ డైరెక్టరుగా ఉన్న ప్రమోటరు లేదా ప్రధాన షేర్‌హోల్డరుకు కార్యకలాపాలను చక్కబెట్టేందుకు, నిర్వహణ బాధ్యతలను ప్రొఫెషనల్స్‌కు అప్పగించేందుకు 10 ఏళ్ల కాలం సరిపోతుంది. దీనివల్ల యాజమాన్యం, నిర్వహణ ను విడదీయడం, ప్రొఫెషనల్‌ నిర్వహణ సంస్కృతిని పెంపొందించడం సాధ్యపడుతుంది’ అని ఆర్‌బీఐ పేర్కొంది. ఈ మేరకు చర్చాపత్రాన్ని విడుద ల చేసింది. దీనిపై జూలై 15లోగా సంబంధిత వర్గా లు ఆర్‌బీఐకి అభిప్రాయాలు తెలియజేయాలి.  

మూడేళ్ల విరామం తర్వాత మరో దఫా..
ఇక ప్రమోటరు లేదా ప్రధాన షేర్‌హోల్డరు కాకుండా మేనేజ్‌మెంట్‌లో భాగమైనవారు సీఈవో లేదా హోల్‌టైమ్‌ డైరెక్టరుగా (డబ్ల్యూటీడీ) వరుసగా 15 ఏళ్ల పాటు కొనసాగవచ్చని వివరించింది. అటుపైన మూడేళ్లు గడిచిన తర్వాత మాత్రమే మళ్లీ సీఈవో, డబ్ల్యూటీడీ హోదాల్లో పునర్‌నియామకానికి వారికి అర్హత లభిస్తుందని తెలిపింది. అయితే ఈ వ్యవధిలో వారు ఏ హోదాలోను ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ, సలహాదారు గా గానీ సదరు బ్యాంకుకు సేవలు అందించకూడ దు. తాజా ప్రతిపాదనలు నోటిఫై చేసేటప్పటికే ప దవీకాలం ముగిసిపోయి ఉంటే వారికి అదనంగా మరో రెండేళ్ల వ్యవధినివ్వాలని లేదా ప్రస్తుత పదవీకాలం తీరిపోయే దాకా (ఏది తర్వాతైతే అది) కొనసాగించవచ్చని తదుపరి ఆర్‌బీఐ తెలిపింది.

బ్యాంకుల్లో ప్రమాణాలను మెరుగుపర్చాల్సిందే...
దేశీ ఆర్థిక వ్యవస్థ పరిమాణం, సంక్లిష్టత పెరిగిపోతుండటమనేది బ్యాంకుల్లో గవర్నెన్స్‌ ప్రమాణాలను పటిష్టపర్చుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోందని ఆర్‌బీఐ చర్చాపత్రంలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయంగా పాటిస్తున్న ఉత్తమ విధానాలను అమల్లోకి తేవాలనే ఉద్దేశంతో ఈ చర్యలు ప్రతిపాదించింది.

మరిన్ని వార్తలు