మరో 3 బ్యాంకులు పీసీఏ నుంచి బైటికి

27 Feb, 2019 00:05 IST|Sakshi

ఆర్‌బీఐ ఆంక్షల నుంచి బైటపడ్డ ధనలక్ష్మి, అలహాబాద్, కార్పొరేషన్‌ బ్యాంక్‌లు

ముంబై: మొండిబాకీల భారం కారణంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు.. రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశిత సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధి నుంచి బైటికొచ్చాయి. అలహాబాద్‌ బ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంక్‌లపై ఆంక్షలు ఎత్తివేస్తూ ఆర్‌బీఐ మంగళవారం నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రైవేట్‌ రంగానికి చెందిన ధన్‌లక్ష్మి బ్యాంక్‌ కూడా పీసీఏ నుంచి బైటికొచ్చింది. ఆయా బ్యాంకుల పనితీరును మదింపు చేసిన మీదట పీసీఏపరమైన ఆంక్షలు ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. అలహాబాద్‌ బ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంక్‌లకు ప్రభుత్వం అదనపు మూలధనం సమకూర్చిన నేపథ్యంలో వాటి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడనుండటం ఇందుకు కారణమని వివరించింది.

గతేడాది డిసెంబర్‌ ఆఖరు నాటికి కార్పొరేషన్‌ బ్యాంకు వితరణ చేసిన మొత్తం రుణాల్లో స్థూల మొండిబాకీలు (ఎన్‌పీఏ) 17.36 శాతంగా ఉండగా, అలహాబాద్‌ బ్యాంక్‌ స్థూల ఎన్‌పీఏలు 17.81 శాతం స్థాయికి చేరాయి. దీంతో వీటిని పీసీఏ పరిధిలోకి చేర్చి.. రుణవితరణ, వ్యాపార విస్తరణ మొదలైన కార్యకలాపాలపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. పీసీఏ పరిధిలోని బ్యాంకుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఇటీవలే జనవరి 31న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌లపై ఆంక్షలు ఎత్తివేసింది. అయితే, ఇప్పటికీ మరో అయిదు ప్రభుత్వ రంగ బ్యాంకులు (యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూకో బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, దేనా బ్యాంక్‌) పీసీఏ పరిధిలోనే ఉన్నాయి.  

మరిన్ని వార్తలు