అలహాబాద్‌ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు

15 May, 2018 00:09 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక పనితీరు అంతకంతకూ దిగజారుతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ అలహాబాద్‌ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. అధిక వడ్డీకి డిపాజిట్లు సమీకరించరాదంటూ, రిస్కులు ఉండే రుణాలు మంజూరు చేయొద్దంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశించినట్లు అలహాబాద్‌ బ్యాంక్‌ తెలిపింది. సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) అమలవుతున్న దేనా బ్యాంక్‌కు కూడా ఆర్‌బీఐ ఇటీవలే ఈ తరహా ఆదేశాలు జారీ చేసింది.

మొండిబాకీలకు అధిక ప్రొవిజనింగ్‌ కారణంగా.. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఏకంగా రూ. 3,510 కోట్ల నికర నష్టం (స్టాండెలోన్‌) నమోదు చేసిన అలహాబాద్‌ బ్యాంక్‌ కూడా ఇప్పటికే పీసీఏ పరిధిలో ఉంది. మరోవైపు, పీసీఏ అమలవుతున్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరును మే 17న సమీక్షించనున్నట్లు కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. పీసీఏ పరిధిలో లేని మిగతా బ్యాంకులు.. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడే కార్యకలాపాలకు తోడ్పాటు అందించాలని ఆయన సూచించారు.  

మరిన్ని వార్తలు