మొండిబకాయిల భారం మరింత!

27 Jun, 2018 00:22 IST|Sakshi

ఆర్‌బీఐ ఎఫ్‌ఎస్‌ఆర్‌ నివేదిక

ముంబై: దేశంలో బ్యాంకింగ్‌ మొండిబకాయిలు (ఎన్‌పీఏ) మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనావేస్తోంది. 2018 మార్చిలో మొత్తం రుణాల్లో 11.6 శాతంగా ఉన్న వాణిజ్య బ్యాంకుల స్థూల మొండిబకాయిలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి 12.2 శాతానికి పెరిగే అవకాశం ఉందని ఆర్‌బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక(ఎఫ్‌ఎస్‌ఆర్‌) పేర్కొంది. వాణిజ్య బ్యాంకుల లాభదాయకత పడిపోతోందని, ఎన్‌పీఏలకు ప్రొవిజినింగ్‌ దీనికి ప్రధాన కారణమని వివరించింది. 

ఆర్‌బీఐ దిద్దుబాటు చర్యల పరిధిలో ఉన్న 11 బ్యాంకులను ఉటంకిస్తూ, 2018 మార్చి నాటికి 21%గా ఉన్న స్థూల మొండిబకాయిల భారం ఆర్థిక సంవత్సరం చివరకు 22.3 శాతానికి పెరిగే అవకాశం ఉందన్నారు. ఆరు బ్యాంకులకు రిస్క్‌–వెయిటెడ్‌ అసెట్స్‌ రేషియోకు సంబంధించి అవసరమైన (9%) మూలధన  సైతం తగ్గే అవకాశం ఉందని నివేదిక వివరించింది. డిపాజిట్లలో వృద్ధి కొరవడినప్పటికీ, 2017–18లో రుణ వృద్ధి పుంజుకుందని పేర్కొంది.  

11 బ్యాంకులు బయటపడేది రెండేళ్ల తర్వాతే!
ఆర్‌బీఐ వాచ్‌లిస్ట్‌ నుంచి 2020 నాటికి బయటపడే అవకాశం ఉందని మొండిబకాయిల (ఎన్‌పీఏ) భారాన్ని ఎదుర్కొంటున్న 11 ప్రభుత్వ  బ్యాంకులు   అభిప్రాయపడుతున్నాయి. పార్లమెంటరీ కమిటీ ముందు  ఆ బ్యాంకుల ఉన్నతాధికారులు తమ అభిప్రాయాన్ని వివరిస్తూ, 2020 నాటికిగానీ దిద్దుబాటు చర్యల (పీసీఏ) చట్టం నుంచి బయటపడే అవకాశం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

ఇటీవల జరిగిన సమావేశంలో  ఆర్‌బీఐ వాచ్‌లిస్ట్‌లో ఉన్న 11 బ్యాంకులు– ఐడీబీఐ బ్యాంక్, యుకో బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్, దేనా బ్యాంక్, ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్,  బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేషన్‌ బ్యాంక్, అలహాబాద్‌ బ్యాంక్‌ ఉన్నత స్థాయి అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.

ప్రభుత్వ రంగ బ్యాంకుల ‘‘రుణ కార్యకలాపాలు స్తంభించిపోవడం గురించి సమావేశంలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి.ఎన్‌పీఏలను పరిష్కార ప్రణాళికను బ్యాంకింగ్‌ అధికారులు సమావేశం ముందు  ఉంచారు.

♦  2017 డిసెంబర్‌ ముగింపునకు మొత్తం బ్యాంకింగ్‌ రంగ మొండిబకాయిలు రూ.8.99 లక్షల కోట్లు. మొత్తం రుణాల్లో ఇది 10.11 శాతం. స్థూల ఎన్‌పీఏల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా రూ.7.77 లక్షల కోట్లు.

దీనికితోడు బ్యాంకింగ్‌లో పెరుగుతున్న తీవ్ర మోసాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2015–16లో మోసాల సంఖ్య 4,693 అయితే, 2017–18 నాటికి 5,904కు చేరింది. ఇదే కాలంలో మోసాల విలువ రూ.18,699 కోట్ల నుంచి రూ.32,361 కోట్లకు పెరిగింది.  

మరిన్ని వార్తలు