పావు శాతం రేట్ల కోతకు అవకాశం

1 Apr, 2019 00:47 IST|Sakshi

4న విధాన ప్రకటనలో  ఉండొచ్చన్న అంచనాలు 

ఈ నెల 2 నుంచి 4 వరకు  ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ 

2019–20లో తొలి సమీక్ష

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగానికి ఉత్తేజాన్నిచ్చేందుకు గాను రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నూతన ఆర్థిక సంవత్సరం (2019–20) తొలి ద్వైమాసిక పరపతి సమీక్షలో పావు శాతం రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం దేశ ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనల నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆర్‌బీఐ ఎంపీసీ చివరి సమీక్ష ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగ్గా, రెపో రేటు, రివర్స్‌ రెపో రేట్లను పావు శాతం చొప్పున తగ్గిస్తూ నాటి సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ ఈ నెల 2 నుంచి సమీక్షపై కసరత్తు చేయనుంది. 4వ తేదీన పాలసీపై ప్రకటన చేస్తుంది. గతంలో మాదిరే ఈ విడత కూడా కీలక సమీక్షకు ముందుగానే ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పరిశ్రమ వర్గాలు, డిపాజిట్ల అసోసియేషన్, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) ప్రతినిధులు, బ్యాంకర్లతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నియంత్రిత స్థాయి 4 శాతం లోపే ఉండడంతో ఆర్థిక రంగానికి ఊతమిచ్చేందుకు మరో విడత రేట్ల కోత అవసరమని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. 

మార్కెట్లకు సానుకూలం  
‘‘పావు శాతం రేట్ల కోతను మార్కెట్లు ఇప్పటికే అంచనా వేశాయి. తటస్థ విధానం నుంచి సర్దుబాటు ధోరణికి ఆర్‌బీఐ తన విధానాన్ని మార్చుకోవడంతోపాటు, లిక్విడిటీ మెరుగుపడడం, రేట్ల కోత నిర్ణయాలు మార్కెట్లకు మంచి సానుకూలం’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పీసీజీ అండ్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ స్ట్రాటజీ హెడ్‌ వీకే శర్మ తెలిపారు. అంతర్జాతీయ, స్థానిక అంశాలు భవిష్యత్తు పాలసీ చర్యలను నిర్ణయిస్తాయని కోటక్‌ మహింద్రా బ్యాంకు ప్రెసిడెంట్‌ శాంతి ఏకాంబరం పేర్కొన్నారు. ‘‘వినియోగం కొంత తగ్గింది. పెట్టుబడుల వాతావరణం కూడా ఇప్పటికీ కనిష్ట స్థాయిలోనే ఉంది. కనుక ఈ ఏడాది చివర్లో మరో విడత పావు శాతం రేట్ల కోత ఉండొచ్చు. అయితే అది ద్రవ్యోల్బణం డేటాపై ఆధారపడి ఉంటుంది. అలాగే, ఎన్నికల తర్వాత బడ్జెట్, రుతుపవనాలు, చమురు ధరలను ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకోవచ్చు’’ అని ఏకాంబరం వివరించారు. 2018–19లో ఆర్థిక వృద్ధి నిదానించడంతో రెపో రేటును కనీసం పావు శాతం అయినా తదుపరి సమావేశంలో తగ్గించాలని, మృదువైన విధానాన్ని కొనసాగించాలని కోరినట్టు సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ తెలిపారు. రేట్ల కోతను బ్యాంకులు బదిలీ చేసేందుకు గాను నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)ను తగ్గించాలని సూచించినట్టు చెప్పారు. ఫిబ్రవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.57 శాతంగా ఉన్న విషయం గమనార్హం. 

మరిన్ని వార్తలు