పావు శాతం రేట్ల కోతకు చాన్స్!

5 Dec, 2016 02:04 IST|Sakshi
పావు శాతం రేట్ల కోతకు చాన్స్!

బ్యాంకర్ల అంచనా...
డీమోనిటైజేషన్‌తో పెరిగిన ద్రవ్య సరఫరా ప్రభావం
7న రిజర్వు బ్యాంక్ పాలసీ సమీక్ష..

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మరోసారి రేట్ల కోతకు సై అంటుందా? మెజారిటీ బ్యాంకర్లు అవుననే అంటున్నారు. బుధవారం(ఈ నెల 7న) జరగనున్న పాలసీ సమీక్షలో కీలక వడ్డీరేటును(రెపో రేటు)ను ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మరో పావు శాతం తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నారుు. ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థలోకి వెల్లువెత్తిన డిపాజిట్లతో ద్రవ్యసరఫరా(లిక్విడిటీ) భారీగా పెరగడం ఆర్‌బీఐ సరళ పాలసీకి ఊతమిస్తుందనేది బ్యాంకర్ల అభిప్రాయం. డీమోనిటైజేషన్ తర్వాత ఇదే తొలి పాలసీ సమీక్ష కావడం గమనార్హం. గవర్నర్‌గా బాధ్యతలను చేపట్టిన తర్వాత ఉర్జిత్ అక్టోబర్‌లో జరిపిన తొలి పాలసీ సమీక్షలోనే పావు శాతం రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కొత్తగా ఏర్పాటైన పరపతివిధాన కమిటీ(ఎంపీసీ) సిఫార్సుల ఆధారంగా అక్టోబర్ పాలసీ సమీక్షలో నిర్ణయం వెలువడింది.

 ప్రస్తుతం రేట్లు ఇలా...
గడిచిన సమీక్షలో పావు శాతం కోతతో రెపో రేటు(బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు) ప్రస్తుతం 6.25 శాతంగా కొనసాగుతోంది.  గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకూ ఆర్‌బీఐ రెపో రేటును 1.75 శాతం తగ్గించింది. రివర్స్ రెపో(ఆర్‌బీఐ వద్ద ఉంచే నిధులపై బ్యాంకులకు లభించే వడ్డీరేటు) 5.75 శాతంగా కొనసాగుతోంది. ఇక నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్-బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో తప్పనిసరిగా ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన పరిమాణం) 4 శాతంగా ఉంది. అరుుతే, కొత్తగా పెరిగిన డిపాజిట్లపై తాత్కాలికంగా ఆర్‌బీఐ దీన్ని 100 శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే.

డీమోనిటైజేషన్ తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్లు ఎగబాకడంతో ఈ చర్యలు తీసుకుంది. తాజా గణాంకాల ప్రకారం పెద్ద నోట్ల రద్దు తర్వాత నుంచి ఇప్పటివరకూ బ్యాంకుల్లోకి రూ.11 లక్షల కోట్లకు పైగానే డిపాజిట్లు వచ్చినట్లు అంచనా. కాగా, మార్కెట్ స్థిరీకరణ స్కీమ్(ఎంఎస్‌ఎస్) కింద ప్రభుత్వ బాండ్‌ల జారీ పరిమితిని తాజాగా రూ.30 వేల కోట్ల నుంచి రూ.6 లక్షల కోట్లకు ఆర్‌బీఐ పెంచిన సంగతి తెలిసిందే. భారీగా పెరిగిన లిక్విడిటీని వెనక్కి గుంజేసేందుకు ఈ చర్యలు చేపట్టారు. ఎంఎస్‌ఎస్ పరిమితి పెరిగిన నేపథ్యంలో త్వరలోనే సీఆర్‌ఆర్ తాత్కాలిక పెంపు(100 శాతానికి)ను సమీక్షించే అవకాశాలున్నాయని బ్యాంకర్లు పేర్కొంటున్నారు.

వృద్ధి అంచనాల్లో కోత?
డీమోనిటైజేషన్ ప్రభావం నేపథ్యంలో ఈ ఏడాది(2016-17) జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్‌బీఐ భారీగా తగ్గించే అవకాశం ఉందని సిటీ గ్రూప్ నివేదిక పేర్కొంది. ఆర్‌బీఐ ప్రస్తుత వృద్ధి రేటు అంచనా 7.6 శాతంగా ఉంది. కాగా, వృద్ధి పడిపోయే రిస్కు కారణంగా... దీనికి అడ్డుకట్టవేసేందుకు రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చని సిటీ గ్రూప్ అంచనా వేసింది. వృద్ధి, ద్రవ్యోల్బణం తగ్గుముఖం అంచనాలతో ఈ ఆర్థిక సంవత్సరంలో పావు శాతం రేట్ల కోతకు ఆస్కారం ఉందని హెచ్‌ఎస్‌బీసీ అభిప్రాయపడింది. కాగా, డీమోనిటైజేషన్ వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో భారీ ద్రవ్యసరఫరాకు ఆస్కారం ఏర్పడిందని.. ఈ పరిస్థితుల్లో తగ్గించిన డిపాజిట్ రేట్లకు అనుగుణంగా ఆర్‌బీఐ  రెపో రేటులో కోత విధించాలని పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ గోపాల్ జివరాజ్కా వ్యాఖ్యానించారు.

బ్యాంకర్ల అంచనాలు ఏంటి?
ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న సంకేతాలతో 7న జరిగే పాలసీ సమీక్షలో పావు శాతం రెపో రేటు కోతకు ఆస్కారం ఉంది.
- రాకేశ్ శర్మ, కెనరా బ్యాంక్ సీఈఓ-ఎండీ

డీమోనిటైజేషన్ ప్రస్తుత, వచ్చే త్రైమాసికాలపై చాలా ప్రభావం చూపనుంది. ఈ రెండు క్వార్టర్లూ చాలా కీలకం. రానున్న సమీక్షలో రెపో రేటు పావు శాతం తగ్గొచ్చు. - ఆర్‌కే బన్సల్, ఐడీబీఐ బ్యాంక్ సీఎఫ్‌ఓ

డిపాజిట్ల వెల్లువతో సీఆర్‌ఆర్‌ను తాత్కాలికంగా 100%కి పెంచడాన్ని బ్యాంకర్లు పెద్ద సమస్యగా పరిగణించడం లేదు. అరుు తే, అధిక లిక్విడిటీ, వడ్డీరేట్ల మధ్య సమతుల్యత ఉండేవిధంగా సర్దుబాటు చేయాలంటే పావు శాతం రెపో రేటు తగ్గించాల్సిందే. - యస్ బ్యాంక్

నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు తగ్గే అవకాశం ఉంది(అక్టోబర్‌రో  రిటైల్ ద్రవ్యోల్బణం 4.2 శాతం, టోకు ధరల ద్రవ్యోల్బణం 3.39%). ప్రధానంగా డీమోనిటైజేషన్ ప్రభావంతో వినయోగ డిమాండ్ తీవ్రంగా పడిపోవడంతో ద్రవ్యోల్బణం తగ్గుముఖ ధోరణి కొనసాగవచ్చు. దీంతో  2017 మార్చిలోపు పావు నుంచి అర శాతం మేర రెపో రేటు తగ్గుతుందని అంచనా.
- ఎస్‌బీఐ సీనియర్ అధికారి

>
మరిన్ని వార్తలు