పాలసీ, గణాంకాలు.. కీలకం!

3 Oct, 2016 01:54 IST|Sakshi
పాలసీ, గణాంకాలు.. కీలకం!

వెలుగులో వడ్డీరేట్ల ప్రభావిత షేర్లు
న్యూఢిల్లీ:  ఆర్‌బీఐ పాలసీ, తయారీ, సేవల రంగానికి సంబంధించిన గణాంకాలు, భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. మంగళవారం(ఈ నెల 4న) జరిగే ద్రవ్య విధాన సమావేశంలో రేట్ల కోత ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. వడ్డీరేట్ల ప్రభావిత షేర్లు వెలుగులో ఉంటాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. సెప్టెంబర్ నెల వాహన విక్రయ వివరాలు వెల్లడైనందున వాహన షేర్లపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుందని వివరించారు. స్వల్పకాలంలో మార్కెట్ కదలికలకు ఆర్‌బీఐ పాలసీ దిశా నిర్దేశం చేస్తుందని శామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీతీ మోది చెప్పారు.
 
సోమవారం(ఈ నెల 3న)వెలువడే తయారీ రంగ పర్ఛేజింగ్ మేనేజర్ ఇండెక్స్(పీఎంఐ), బుధవారం(ఈ నెల 5న)వెలువడే సేవల రంగ పీఎంఐ గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి కూడా ట్రేడింగ్‌పై ప్రభావం చూపుతాయి.   డాయిష్ బ్యాంక్ షేర్ ధర, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం మార్కెట్ కదలికలపై ప్రభావం చూపుతుందని జైఫిన్ అడ్వైజర్స్ చీఫ్ దేవేంద్ర నేవ్‌గి చెప్పారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని వివరించారు. ఇక అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే, అమెరికాలో వ్యవసాయేతర ఉద్యోగ గణాంకాలు శుక్రవారం(ఈ నెల 7న) వస్తాయి.
 
విదేశీ పెట్టుబడులు.. 11 నెలల గరిష్టం: విదేశీ ఇన్వెస్టర్లు గత నెలలో రూ.20,233 కోట్లు మన క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. గత 11 నెలల్లో ఇదే గరిష్ట స్థాయి. డిపాజిటరీల గణాంకాల ప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.10,443 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.9,789 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశారు.  కార్పొరేట్ బాండ్లలో నేరుగా పెట్టుబడుల పెట్టడానికి విదేశీ ఇన్వెస్టర్లను సెబీ అనుమతించడంతో విదేశీ పెట్టుబడుల జోరు కొనసాగుతుందని నిపుణులంటున్నారు.

జీఎస్‌టీ అమలులో పురోగతి, కంపెనీలు ఆర్థిక ఫలితాలు బాగా ఉండడం, గత నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచకపోవడం,  కరెంట్ అకౌంట్ లోటు తగ్గడం వంటి కారణాల వల్ల విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోందని వారంటున్నారు. కాగా ఈ ఏడాదిలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.51,293 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.2,441 కోట్లు పెట్టుబడులు పెట్టారు.

మరిన్ని వార్తలు