తక్కువ వడ్డీ దారిలో ఆర్‌బీఐ: ఫిచ్‌ 

25 Apr, 2019 00:00 IST|Sakshi

ఆసియా పసిఫిక్‌ ప్రాంత

సెంట్రల్‌ బ్యాంకుల్లో ప్రత్యేకమని వ్యాఖ్య  

న్యూఢిల్లీ: ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో తక్కువ వడ్డీరేటు వ్యవస్థలోకి తిరిగి ప్రవేశించిన తొలి సెంట్రల్‌ బ్యాంక్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ– ఫిచ్‌ పేర్కొంది. దేశీయంగా తక్కువ స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణ ధోరణులు, అమెరికా సెంట్రల్‌బ్యాంక్‌ ఫెడ్‌ ఫండ్‌ రేటు పెంచే అవకాశాలు కనబడని తీరు, దీనితో అంతర్జాతీయంగా సరళతరంగా ఉన్న ఫైనాన్షియల్‌ పరిస్థితులు... ఆర్‌బీఐ రేటు తగ్గింపునకు దోహదపడుతున్న అంశాలుగా ఫిచ్‌ వివరించింది. ఆర్‌బీఐ ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈ నెల 4వ తేదీన రెపో రేటు పావుశాతం కోతకు నిర్ణయం తీసుకుంది. దీనితో ఈ రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. అంతకుముందు రెండు నెలల క్రితం జరిగిన  ద్వైమాసిక సమావేశంలో (ఫిబ్రవరి 7) కూడా ఆర్‌బీఐ రెపో రేటు పావుశాతం కోత నిర్ణయం తీసుకుంది. 2016లో ఎంపీసీ ఏర్పాటయిన తర్వాత ఇలా వరుసగా రెండుసార్లు రేటు కోత నిర్ణయం ఇదే తొలిసారి. గత ఏడాది ఆర్‌బీఐ రెండు సార్లు అరశాతం రేటు పెంచింది. తాజా నిర్ణయంతో పెరిగిన మేర రివర్స్‌ అయినట్లయ్యింది. ఈ నేపథ్యంలో ఫిచ్‌ తన తాజా ఆసియా పసిఫిక్‌ సావరిన్‌ క్రెడిట్‌ ఓవర్‌వ్యూ రిపోర్ట్‌ విడుదల చేసింది. ఇందులోని ముఖ్యాంశాలు... 

► మరింత రేటు తగ్గింపునకు అవకాశాలను ఆర్‌బీఐ అన్వేషించే అవకాశం ఉంది. అయితే 2019లో రేటు తగ్గింపు ఇంతకుమించి ఉండకపోవచ్చు.  
► వస్తున్న ఆదాయాలు తగ్గడం– వ్యయాలు పెరగడం వంటి అంశాలు భారత్‌ ద్రవ్యలోటు పరిస్థితులకు సవాళ్లు విసిరే అవకాశం ఉంది. కొన్ని నగదు ప్రత్యక్ష బదలాయింపులు ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేయవచ్చు.  
► 2025 ఆర్థిక సంవత్సరం నాటికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ప్రభుత్వ రుణాన్ని 60 శాతానికి పరిమితం చేయాలన్నది భారత్‌ ప్రణాళిక. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, భారత్‌ ద్రవ్యలోటు లక్ష్యాలను సాధించాల్సి ఉంటుంది.  
► కేంద్ర రుణ భారం తీవ్రంగా ఉంది. ఫైనాన్షియల్‌ రంగంలో ఇబ్బందులు ఉన్నాయి. వ్యవస్థాగత అంశాల్లో లోపాలు ఉన్నాయి. అయితే సమీప కాలంలో దేశం పటిష్ట వృద్ధి బాటన కొనసాగే అవకాశం ఉంది. విదేశీ మరకపు నిల్వలు (400 బిలియన్‌ డాలర్ల ఎగువన) పటిష్టంగా ఉన్నాయి. విదేశీ సవాళ్లను తట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనితో సవాళ్లు–ఆశావహ పరిస్థితులు మధ్య సమతౌల్యత కనిపిస్తోంది. దీనితో ఫిచ్‌ రేటింగ్స్‌ (‘బీబీబీ–’ దిగువస్థాయి పెట్టుబడుల గ్రేడ్‌)  యథాతథంగా కొనసాగుతుంది.  
► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్‌ జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉండవచ్చు. 2020–21లో 7.1 శాతానికి పెరిగే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు