‛దివాన్‌’..దివాలా!

21 Nov, 2019 04:32 IST|Sakshi

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ డైరెక్టర్ల బోర్డును రద్దు చేసిన ఆర్‌బీఐ

త్వరలో దివాలా ప్రక్రియ మొదలు... అడ్మినిస్ట్రేటర్‌ నియామకం

దివాలా చర్యలను ఎదుర్కోనున్న తొలి ఎన్‌బీఎఫ్‌సీ

ముంబై: తీవ్రమైన రుణ సంక్షోభంలో చిక్కుకున్న దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌)పై ఆర్‌బీఐ కొరడా ఝళిపించింది.   కంపెనీ డైరెక్టర్ల బోర్డును రద్దు చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు మాజీ ఎండీ ఆర్‌ సుబ్రమణియకుమార్‌ను పాలనాధికారిగా (అడ్మినిస్ట్రేటర్‌) నియమించింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దివాలా పరిష్కార ప్రణాళిక త్వరలోనే ప్రారంభమవుతుందని ఆర్‌బీఐ ప్రకటించింది.

రూ.500 కోట్లు, అంతకుమించి ఆస్తులు కలిగిన సమస్యాత్మక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలను (హెచ్‌ఎఫ్‌సీలు) దివాలా చట్టం (ఐబీసీ) కింద పరిష్కార చర్యల కోసం ఎన్‌సీఎల్‌టీకి ప్రతిపాదించే అధికారాన్ని ఆర్‌బీఐకి కట్టబెడుతూ కేంద్ర సర్కారు గత వారమే నిర్ణయం తీసుకుంది. వెనువెంటనే డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ విషయంలో ఆర్‌బీఐ తన అధికారాల అమలును ఆరంభించింది. దీంతో దివాలా చర్యల పరిష్కారానికి వెళ్లనున్న తొలి ఎన్‌బీఎఫ్‌సీ/హెచ్‌ఎఫ్‌సీ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కానుంది. ‘‘బ్యాంకు రుణాలు, మార్కెట్‌ రుణాలకు చెల్లింపుల్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ విఫలమైంది.

కంపెనీ నిర్వహణ తీరుపై ఇది తీవ్ర ఆందోళనలను కలిగిస్తోంది. అందుకే డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ బోర్డును రద్దు చేయడమైంది. ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) కింద డీహెచ్‌ఎఫ్‌కు పరిష్కారం కోసం త్వరలోనే చర్యలను ప్రారంభిస్తాం’’ అని ఆర్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది. 2019 జూలై నాటికి బ్యాంకులు, నేషనల్‌ హౌసింగ్‌ బోర్డ్, మ్యూచువల్‌ ఫండ్స్, బాండ్‌ హోల్డర్స్‌కు రూ.88,873 కోట్ల మేర డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ.74,054 కోట్లు సెక్యూర్డ్‌ కాగా, రూ.9,818 కోట్లు అన్‌సెక్యూర్డ్‌ రుణాలు. వీటిలో బ్యాంకులకు చెల్లించాల్సినది రూ. 38,342 కోట్లుగా అంచనా.  ఒక్క ఎస్‌బీఐకే రూ.10,000 కోట్ల మేర డీహెచ్‌ఎఫ్‌ఎల్‌  బకాయి పడింది. చాలా బ్యాంకులు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రుణ ఆస్తులను నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు)గా గుర్తించడంతోపాటు కేటాయింపులు చేయాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని ఈ పనిని మొదలు పెట్టాయి.  

ఆల్టికో సైతం..
ఆల్టికో క్యాపిటల్, రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌లను సైతం  దివాలా పరిష్కార చర్యలకు ప్రతిపాదించాలని ఆర్‌బీఐ నిర్ణయించుకున్నట్టు సమాచారం. కానీ, దీనిపై ప్రకటనేమీ వెలువడలేదు. ఆల్టికో రుణ భారం 2019 మార్చికి రూ.5,319 కోట్లు. మాష్‌రెక్‌ బ్యాం కుకు రూ.347 కోట్ల అసలు, రూ.19.97 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైంది.

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలూ చేరొచ్చు: త్యాగి
ఐబీసీ కింద పరిష్కారంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలూ భాగం కావొచ్చని సెబీ చైర్మన్‌ అజయ్‌త్యాగి పేర్కొన్నారు. ‘‘ఐబీసీ కింద మ్యూచువల్‌ ఫండ్స్‌ను కూడా రుణదాతలుగా పరిగణించడం జరుగుతుంది. ఈ విషయంలో ఇంతకుమించి చెప్పేదేమీ లేదు’’ అని త్యాగి అన్నారు.     

అందలం నుంచి పాతాళానికి...
హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ అయిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను రాజేష్‌ కుమార్‌ వాధ్వాన్‌ 1984లో ప్రారంభించారు. అల్పాదాయ, మధ్యతరగతి  వర్గాలకు గృహ రుణాలిచ్చే ఉద్దేశంతో ఇది ఏర్పాటైంది. దివాన్‌ హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌గాను, ఆ తర్వాత దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌గాను పేర్లు మార్చుకుంది. దేశీయంగా 50 భారీ ఆర్థిక సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో ఏకంగా రూ. 31,000 కోట్లను డొల్ల కంపెనీ ద్వారా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మళ్లించిందంటూ కోబ్రాపోస్ట్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ ఆరోపణలను కంపెనీ ఖండించింది. అయితే, జూన్‌లో జరపాల్సిన రుణ చెల్లింపు విషయంలో డిఫాల్ట్‌ కావడంతో సంస్థపై సందేహాలు తలెత్తాయి. ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. కంపెనీలో అవకతవకలు ఒక్కొక్కటిగా బయటికొచ్చాయి. కేంద్రం ఎస్‌ఎఫ్‌ఐఓ దర్యాప్తునకు కూడా ఆదేశించింది. ఇప్పుడు ఆర్‌బీఐ కంపెనీని తన గుప్పిట్లోకి తీసుకొని దివాలా ప్రక్రియను ప్రారంభించనుండటంతో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కథ ముగిసినట్లేనన్నది పరిశీలకుల అభిపారయం.

ఎప్పుడేం జరిగిందంటే...
► 2018 సెప్టెంబర్‌ 21: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ జారీ చేసిన డెట్‌ పేపర్లు రూ.300 కోట్ల విలువైన వాటిని సెకండరీ మార్కెట్లో డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ విక్రయించింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్న ఆరోపణలు వచ్చాయి.  
► 2019 జనవరి 29: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు వారికి సంబంధించిన షెల్‌ కంపెనీలకు రుణాలు ఇవ్వగా, ఆ నిధులను దేశీయంగా, విదేశాల్లో ఆస్తుల కొనుగోలుకు ప్రమోటర్లు వినియోగించినట్టు ఆన్‌లైన్‌ పోర్టల్‌ ‘కోబ్రాపోస్ట్‌’ సంచలనాత్మ క కథనాన్ని ప్రచురించింది. యథావిధిగా దీన్ని సైతం కంపెనీ ఖండించింది.
► జనవరి 30: కోబ్రాపోస్ట్‌ ఆరోపణలు అవాస్తవం, హానికారకమని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రకటించింది. షెల్‌ కంపెనీల ద్వారా నిధులు మళ్లించారన్న ఆరోపణలను కొట్టిపడేసింది.
► జనవరి 31: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు సంబంధించిన ఆరోపణలపై విచారణ మొదలు పెట్టిన కార్పొరేట్‌ శాఖ.  
► ఫిబ్రవరి 4: కంపెనీకి చెందిన కొన్ని ఆస్తులను విక్రయించడం ద్వారా నిధుల లభ్యతను పెంచుకోనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
► ఫిబ్రవరి 11: కొన్ని ఖాతాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసు జారీ.  
► ఫిబ్రవరి 13: కంపెనీ సీఈవో హర్షిల్‌ మెహతా రాజీనామా
► మార్చి 7: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన డెట్‌ ఇన్‌స్ట్రుమెంట్ల రేటింగ్‌ ను ఏజెన్సీలు డౌన్‌గ్రేడ్‌ చేయడంతో షేరు ధర మరింత క్షీణత.  
► మే 21: ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల స్వీకరణ, రెన్యువల్‌ను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నిలిపివేసింది. అప్పటికే ఉన్న డిపాజిట్లను ముందస్తుగా ఉపసంహరించుకోవడాన్ని కూడా నిలిపివేసింది.
► జూన్‌ 4: రూ.960 కోట్ల మేర బాండ్లపై వడ్డీ చెల్లింపులు, బాండ్ల చెల్లింపుల్లో విఫలమైంది.  
► జూన్‌ 5: ఇక్రా, క్రిసిల్, కేర్, బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ సంస్థలు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన కమర్షియల్‌ పేపర్ల రేటింగ్‌ను డీ (డిఫాల్ట్‌) రేటింగ్‌కు తగ్గించేశాయి.  
► జూన్‌ 7: 750 కోట్ల కమర్షియల్‌ పేపర్లకు చెల్లింపుల్లో విఫలం.
► అక్టోబర్‌ 10: అన్‌సెక్యూర్డ్‌ క్రెడిటర్లు, డిపాజిట్‌ హోల్డర్లకు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌  చెల్లింపులు చేయకుండా బాంబే హైకోర్టు ఆదేశాలు.    
► నవంబర్‌ 1: నిధుల దారి మళ్లింపునకు ఆధారాలు ఉండడంతో తీవ్ర నేరాల దర్యాప్తు విభాగం (ఎస్‌ఎఫ్‌ఐవో) విచారణకు కార్పొరేట్‌ శాఖ ఆదేశం.

అప్పుడు 692... ఇప్పుడు 20
కుప్పకూలిన షేరు ధర...
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంక్షోభంతో కంపెనీ షేరు ధర కుప్పకూలింది. గతేడాది సెప్టెంబర్‌లో ఆల్‌టైం గరిష్ట స్థాయి రూ. 692ని తాకింది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్‌ 30న కనిష్ట స్థాయి రూ. 15కి పడిపోయింది.  బీఎస్‌ఈలో బుధవారం సుమారు 4% క్షీణించి రూ. 20 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు