కొత్త పథకాలపై బ్యాంకులు దృష్టిపెట్టాలి..

16 Oct, 2014 01:19 IST|Sakshi
కొత్త పథకాలపై బ్యాంకులు దృష్టిపెట్టాలి..

త్వరలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మార్గదర్శకాలు
* ఉచిత నగదు పథకాలతో జాగ్రత్త..
* ఐడీఆర్‌బీటీ అవార్డుల కార్యక్రమంలో ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రజల వ్యక్తిగత ఆర్థిక అవసరాలను తీర్చే పథకాలను ప్రవేశపెట్టడంపై బ్యాంకులు దృష్టిసారించాలని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారు. టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా అందుబాటు చార్జీలతో అత్యధిక జనాభాకి అవసరాలను తీర్చే పథకాలను ప్రవేశపెట్టొచ్చన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఐడీఆర్‌బీటీ  టెక్నాలజీ అవార్డుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న  రాజన్ కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి ప్రత్యేక బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా ఇప్పటికే పేమెంట్ బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేశామని, త్వరలోనే చిన్న ఖాతాదారుల అవసరాలను తీర్చే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. మొబైల్, ఐటీ వంటి కంపెనీలకు పేమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేయడానికి అనుమతిస్తున్నామని, ఇవి వాణిజ్య బ్యాంకులతో ఒప్పందం కుదుర్చకోవడం ద్వారా మరిన్ని పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావచ్చన్నారు. జనధన యోజన కింద ప్రారంభిస్తున్న ఖాతాలను  ఆధార్‌కార్డు ల అనుసంధానం ద్వారా ప్రభుత్వ సబ్సిడీలు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్తాయని, ఈ నిధులను వినియోగించుకుంటున్న తీరును సాంకేతికంగా పరిశీ లించడం ద్వారా అందుకుతగ్గ  పథకాలను ప్రవేశపెట్టాలన్నారు.
 
మోసపూరిత మెసేజ్‌ల పట్ల జాగ్రత్త...
టెక్నాలజీతో ఎంత ప్రయోజనాలున్నాయో అదే సమయంలో ఇది దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉండటంతో ఈ విషయంలో బ్యాంకులతో పాటు, ఖాతాదారులు కూడా అప్రమత్తతతో ఉండాలన్నారు. గతవారం జేపీమోర్గాన్ చేజ్ అకౌంట్లను హ్యాక్ చేయడం ద్వారా అనేక ఖాతాలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ(ఐడీ బీ ఆర్‌టీ) వంటి సంస్థల సహకారం తీసుకోవడం ద్వారా ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చన్నారు. అలాగే ఇప్పుడు ఆర్‌బీఐ పేరుతోనే లేదా నైజీరియా, బ్రిటన్ వంటి దేశాల నుంచి భారీ నగదు ప్రైజు వచ్చిందని వస్తుందన్న మెసేజ్‌లు, ఈ-మెయిల్స్‌పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

కొంత డబ్బు కడితే మీకు భారీ మొత్తం అందిస్తామంటున్న మేసేజ్‌లకు స్పందించే ముందు ఉచితంగా ఏదీ రాదన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఆర్‌బీఐ కానీ, మరేవరైనా కానీ ఉచితంగా ఎటువంటి నగదు ఇవ్వవని, ఆర్‌బీఐ ఎప్పుడూ ఇటువంటి మెసేజ్‌లను పంపించదన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని చేసే ఇటువంటి మోసాలపై అందరూ జాగురకతతో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐడీఆర్‌బీఐ చైర్మన్, ఆర్‌బీఐ డిప్యూటి గవర్నర్ ఆర్.గాంధీ, ఐడీఆర్‌బీటీ డెరైక్టర్ బి.సాంబమూర్తి, ఐడీఆర్‌బీటీ డిజిగ్నేటెడ్ డెరైక్టర్ ఎ.ఎస్.రామశాస్త్రితో పాటు వివిధ బ్యాంకుల సీఎండీలు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెక్నాలజీ వినియోగంలో మంచి పనితీరు కనపర్చిన బ్యాంకులకు రాజన్ అవార్డులను అందచేశారు.
 
రాజన్‌కు యూరోమనీ అవార్డ్
ముంబై: ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు యూరోమనీ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ లభించింది. లోటుతో కొట్టుమిట్టాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థను కఠినమైన ద్రవ్య విధానాలతో రఘురామ్ రాజన్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారని యూరోమనీ ప్రశంసించింది. వంద కోట్ల ప్రజల కోసం మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని వివరించింది. విదేశీ నిధులు భారత్ నుంచి వెలుపలికి తరలుతుండడం, రూపాయి రికార్డ్ స్థాయిలో పతనాన్ని చేరుకోవడం, గతంలో ఆసియా దేశాల సంక్షోభం మాదిరి సంక్షోభం భారత్‌లో కూడా తలెత్తనున్నదన్న ఆందోళనలను ఆయన సమర్థవంతంగా ఎదుర్కొ న్నారని యూరోమనీ తెలిపింది.

మరిన్ని వార్తలు