రేటు కోత ఉండకపోవచ్చు: ఎస్‌బీఐ చీఫ్

21 Nov, 2014 00:57 IST|Sakshi
రేటు కోత ఉండకపోవచ్చు: ఎస్‌బీఐ చీఫ్

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిసెంబర్ 2 తన పరపతి విధాన సమీక్ష సందర్భంగా పాలసీ రేటును తగ్గించకపోవచ్చన్న అభిప్రాయాన్ని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య గురువారం పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఆర్‌బీఐ తన కఠిన పరపతి విధానాన్ని విడనాడే అవకాశం ఉందని కూడా అంచనావేశారు. ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్‌బీఐ విధానంపై ‘బేస్ ఎఫెక్ట్’ అంశం ప్రభావితం చూపే అవకాశం ఉంటుందని అన్నారు.

 డీఅండ్‌బీ అంచనా ఇదీ...
 నవంబర్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 1.8 శాతం నుంచి 2 శాతం శ్రేణిలో నమోదయ్యే అవకాశం ఉందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీఅండ్‌బీ)ఇండియా ఒక నివేదికలో పేర్కొంది.

 తగిన పరిశీలన చేశాకే ఎంవోయూ కుదుర్చుకున్నాం
 అదానీ గ్రూప్ రుణంపై వివరణ
 అదానీ గ్రూప్‌నకు రుణమిచ్చేందుకు కేవలం అవగాహనా ఒప్పందాన్ని(ఎంవో యూ) మాత్రమే కుదుర్చుకున్నామని, తగిన పరిశీలన చేశాకే నిధులను విడుదల చేస్తామని ఎస్‌బీఐ  ప్రకటన ఒకటి తెలిపింది.
 ఆస్ట్రేలియాలోని కార్‌మైఖేల్ బొగ్గు మైనింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి అదానీ గ్రూప్‌నకు ఎస్‌బీఐ 100 కోట్ల డాలర్ల(సుమారు రూ. 6,200 కోట్లు) రుణంఇచేందుకు ఇటీవలే ఎంవోయూ కుదుర్చుకుంది. ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా జరిగిన ఈ అంశంపై ఇప్పటికే పలు విమర్శలు చెలరేగిన నేపథ్యంలో ఎస్‌బీఐ వివర ణకు ప్రాధాన్యత ఏర్పడింది. చైర్‌పర్సన్ అరుంధతీ కూడా ఇదే విధమైన వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు