ఈ యాప్‌ వాడుతున్నారా? ఆర్‌బీఐ హెచ్చరిక

20 Feb, 2019 09:37 IST|Sakshi

ఎనీ డెస్క్‌ యాప్‌ ద్వారా యూజర్ల డేటా చోరీ ఆర్‌బీఐ హెచ్చరిక

సైబర్‌ నేరగాళ్లు నగదును  దొంగిలించే అవకాశం - ఆర్‌బీఐ


సాక్షి, ముంబై: డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్న తరుణంలో సైబర్‌ నేరగాళ్లు కూడా అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్‌ వినియోగదారులే టార్గెట్‌గా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా  (ఆర్‌బీఐ) తాజా హెచ్చరికలు జారీ చేసింది.  డిజిటల్ లావాదేవీలు జరిపే మొబైల్ ఫోన్ యూజర్లు  ఆయా యాప్స్‌ పట్ల  అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా  ‘ఎనీ డెస్క్‌’ అనే ఓ మొబైల్‌ యాప్‌ ద్వారా ‘యునైటెడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌’ (యూపీఐ) ఆన్‌లైన్‌ చెల్లింపుల వ్యవస్థలో కొన్ని మోసాలు జరుగుతున్నాయని  వెల్లడించింది. 

ఎనీ డెస్క్ అనే యాప్‌  ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిపే  యూజర్లతోపాటు,  బ్యాంకులు, ఇతర ఆపరేటర్లు అప్రమత్తంగా వుండాలని ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ యాప్‌  ఇన్‌స్టాల్‌  చేసిన  అనంతరం ఈ యాప్‌ లోని లోపాల కారణంగా డేటా చోరీ అవుతోందని తెలిపింది. యూజర్ల మొబైల్స్‌లోని డేటాను చోరీ  చేసి,  తద్వారా  నేరగాళ్లు మోసపూరిత లావాదేవీలకు ఉపయోగపడుతోందని ఆరోపించింది.  అంటే యాప్ ద్వారా వినియోగదారుల ఫోన్లను ఆధీనంలోకి తీసుకొని వారి ఖాతాల్లోని డబ్బును కొందరు సైబర్ నేరగాళ్లు మాయం చేస్తున్నారని తెలిపింది. ఈ మేరకు ఆర్‌బీఐకు చెందిన సైబర్‌ భద్రత, ఐటీ పరిశోధన విభాగం ఫిబ్రవరి 14వ తేదీన ప్రకటనను కూడా విడుదల చేసింది. మరోవైపు ఈ యాప్‌ ద్వారా ఏప్రిల్, 2018, జనవరి 2019 మధ్య రూ. 6.4 లక్షల కోట్ల విలువైన388 కోట్ల లావాదేవీలు జరిపిందని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) వెబ్‌సైట్‌ తెలిపింది.  

మరిన్ని వార్తలు