మొండిబకాయిలు పైపైకి!

1 Jul, 2017 01:01 IST|Sakshi
మొండిబకాయిలు పైపైకి!

2018 మార్చి నాటికి
10.2 శాతానికి చేరే అవకాశం
2017–18 జీడీపీ వృద్ధి రేటు 7.3 శాతం
ఆర్‌బీఐ ద్రవ్య స్థిరత్వ నివేదిక వెల్లడి  


ముంబై: బ్యాంకింగ్‌ మొండిబకాయిలకు (ఎన్‌పీఏ) సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రమాద ఘంటికలు మ్రోగించింది. 2017 మార్చి నాటికి 9.6 శాతంగా ఉన్న నిరర్థక ఆస్తులు 2018 మార్చి నాటికి 10.2 శాతానికి చేరే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 2016 సెప్టెంబర్‌లో ఎన్‌పీఏల రేటు 9.2 శాతం కావడం గమనార్హం. ఈ మేరకు ఆర్‌బీఐ తన తాజా ద్రవ్య స్థిరత్వ నివేదికను ఆవిష్కరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని కూడా ఈ నివేదిలో ఆర్‌బీఐ పేర్కొంది.

నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలను చూస్తే...
నికర మొండిబకాయిల (ఎన్‌ఎన్‌పీఏ) రేషియో 2016 సెప్టెంబర్‌లో 5.4 శాతం ఉంటే, 2017 మార్చినాటికి ఈ రేటు 5.5 శాతానికి పెరిగింది.
ఒత్తిడిలో ఉన్న రుణ నిష్పత్తి (స్ట్రెస్డ్‌ అడ్వాన్సెస్‌ రేషియో) మాత్రం 12 శాతం నుంచి 12.3 శాతానికి ఎగసింది. వ్యవసాయం, సేవలు, రిటైల్‌ రంగాల్లో ఈ తరహా రుణ నిష్పత్తి తగ్గితే, పారిశ్రామిక రంగం విషయంలో మాత్రం 22.3 శాతం నుంచి 23 శాతానికి చేరింది.
నికర మొండిబకాయిల విషయంలో మొదటి తొలి అకౌంట్ల వాటా 25.6 శాతంగా ఉంది.
రుణాల జారీ విషయంలో బ్యాంకుల వాటా 2015–16లో 50 శాతంగా ఉంటే, 2016–17లో ఈ రేటు 38 శాతానికి చేరింది. అయితే ఇది వాణిజ్య రంగం రుణాలపై ఎటువంటి ప్రభావం చూపలేదు. ఫైనాన్షియల్‌ యేతర సంస్థలు, కమర్షియల్‌ పేపర్ల నికర జారీ వంటి అంశాలు దీనికి కారణం.
ఇతర నిర్వహణ పరమైన ఆదాయాలు పెరగడం వల్ల బ్యాంకుల నికర ఆదాయం 2016–17లో 48 శాతం పెరిగింది. మొండిబకాయిలకు సంబంధించి కేటాయింపులు (ప్రొవిజనింగ్స్‌) కూడా కొంతే పెరగడం ఇక్కడ బ్యాంకింగ్‌కు మొత్తంగా కలిసి వచ్చిన అంశం. కాగా, 2015–16లో బ్యాంకింగ్‌ నికర లాభం 61.6 శాతం మేర క్షీణించింది.
సెప్టెంబర్‌ 2016 నుంచి 2017 మార్చి మధ్య రుణ వృద్ధి రేటు క్షీణిస్తే, డిపాజిట్‌ వృద్ధి మాత్రం పెరిగింది. కాగా ఇదే కాలంలో బ్యాంకుల క్యాపిటల్‌ టూ రిస్క్‌ వెయిటేజ్డ్‌ రుణ నిష్పత్తి 13.4 శాతం నుంచి 13.6 శాతానికి మెరుగుపడింది.

వృద్ధికి సంస్కరణల బాట...
మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్‌ స్థూల దేశీయోత్పత్తి 7.3 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ నివేదిక అంచనా వేసింది. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వంటి ఆర్థిక సంస్కరణలు, దేశంలో రాజకీయ స్థిరత్వం వంటి అంశాలు ఈ స్థాయి వృద్ధికి దోహదపడతాయని వివరించింది. ఇక ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య వ్యత్యాసం–ద్రవ్యలోటు 2016–17లో 3.5 శాతంగా ఉంటే, ఇది 2017–18లో 3.2 శాతానికి తగ్గుతుందన్న అంచనాలనూ నివేదిక వెలిబుచ్చింది. ప్రభుత్వ వ్యయాలు పెరగడం, పేదల గృహ నిర్మాణాలకు చేయూత, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం, గ్రామీణాభివృద్ధిపై దృష్టి వంటి అంశాలు దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని నివేదిక వివరించింది.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, రియల్టీలకి ప్రోత్సాహం, జీఎస్‌టీ అమలు, విదేశాలకు ఎగుమతులు తిరిగి మెరుగుపడుతున్న ధోరణి కూడా వృద్ధికి ఊతం ఇచ్చే అంశాలుగా వివరించింది. ఇక ద్రవ్యోల్బణం కూడా పూర్తి అదుపులో ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సగటున విని యోగ ధరల ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 నుంచి 3.5 శాతం మధ్య ఉంటుందనీ, తరువాతి ఆరు నెలల్లో ఇది 3.5 నుంచి 4.5 శాతం ఉంటుందని ఆర్‌బీఐ నివేదిక విశ్లేషించింది. కేంద్రంలో ద్రవ్య పరిస్థితులు అదుపులోకి వస్తున్నప్పటికీ, రాష్ట్రాల విషయంలో కొంత ఆందోళన ఉందని నివేదిక పేర్కొంది.

ప్రొవిజనింగ్స్‌ రెట్టింపు: మోర్గాన్‌ స్టాన్లీ
ఇదిలాఉండగా, డర్టీ 12 సంస్థల మొండిబకాయిల వల్ల ఈ ఏడాది బ్యాంకింగ్‌ కేటాయింపులు (ప్రొవిజనింగ్స్‌) రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ–మోర్గాన్‌ స్టాన్లీ తన తాజా నివేదికలో వివరించింది. 12 సంస్థలపై దివాలా ప్రొసీడింగ్స్‌ జరుగుతున్న నేపథ్యంలో భారీ ప్రొవిజనింగ్స్‌ అవసరం ఏదీ పడదని కొన్ని బ్యాంకులు పేర్కొంటున్నప్పటికీ, మొత్తంగా ప్రస్తుత స్థాయిల నుంచి ఇవి రెట్టింపయ్యే వీలుందని మోర్గాన్‌ స్టాన్లీ అభిప్రాయపడింది.

>
మరిన్ని వార్తలు