ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లాభం 35% అప్‌ 

20 Jul, 2018 01:40 IST|Sakshi

38 శాతం పెరిగిన  నికర వడ్డీ ఆదాయం 

కేటాయింపులు పెరగటంతో నష్టపోయిన షేరు  

ముంబై: చిన్న తరహా ప్రైవేట్‌ రంగ బ్యాంక్, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌ క్వార్టర్‌లో 35 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.141 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.190 కోట్లకు పెరిగిందని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం 38 శాతం వృద్ధితో రూ.553 కోట్లకు, ఇతర ఆదాయం 27 శాతం వృద్ధితో రూ.326 కోట్లకు పెరిగాయని బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ విశ్వవీర్‌ అహుజా తెలిపారు. కీలకమైన ఫీజు ఆదాయం 58 శాతం వృద్ధి చెందగా, నిర్వహణ ఆదాయం 39 శాతం వృద్ధితో రూ.432 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం, ఇతర ఆదాయం, నిర్వహణ ఆదాయాలు బాగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని పేర్కొన్నారు.  

నికర వడ్డీ మార్జిన్‌ 4 శాతం రేంజ్‌లో... 
రుణాలు 36 శాతం వృద్ధి చెందడం, నికర వడ్డీ మార్జిన్‌ అర శాతం విస్తరించి 4.04 శాతానికి చేరడంతో నికర వడ్డీ ఆదాయం మంచి వృద్ధి సాధించినట్లు అహుజా తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం అంతా నికర వడ్డీ మార్జిన్‌ను 4 శాతానికి మించి కొనసాగిస్తామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. రుణాలు 36 శాతం వృద్ధితో రూ.42,198 కోట్లకు, డిపాజిట్లు 27 శాతం వృద్ధితో రూ.44,960 కోట్లకు ఎగిశాయని చెప్పారు.  

తగ్గిన మొండి బకాయిలు.. 
గత క్యూ1లో 1.46 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 1.40 శాతానికి తగ్గాయని అహుజా తెలిపారు. అలాగే నికర మొండి బకాయిలు 0.78 శాతం నుంచి 0.75 శాతానికి తగ్గాయని పేర్కొన్నారు. కేటాయింపులు రూ.94 కోట్ల నుంచి 49 శాతం వృద్ధి (క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ప్రాతిపదికన చూస్తే, 24 శాతం వృద్ధితో రూ.140 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ప్రొవిజన్‌  కవరేజ్‌ రేషియో 57.99 శాతం నుంచి 60.41 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. బీఎస్‌ఈలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేర్‌ 1.6 శాతం నష్టంతో రూ.556 వద్ద ముగిసింది.    

మరిన్ని వార్తలు