ఆర్‌కామ్‌–జియో డీల్‌ బ్యాంకులకు మంచిదే

30 Dec, 2017 02:26 IST|Sakshi

ఎస్‌బీఐ చీఫ్‌ రజనీష్‌ కుమార్‌

న్యూఢిల్లీ: రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌), రిలయన్స్‌ జియో మధ్య కుదిరిన డీల్‌ ఆహ్వానించదగ్గ పరిణామమని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పేర్కొంది. ‘ఆర్‌కామ్‌–జియో డీల్‌ బ్యాంకులకు ప్రయోజనకరమైనది. పూర్తి రక్షణ లభిస్తుంది.

టెలికం రంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ వీటికి దాదాపు ఎలాంటి నష్టాలు ఉండకపోవచ్చు’ అని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ తెలిపారు. రుణ ఒత్తిడిలో ఉన్న ఇతర కంపెనీల ప్రమోటర్లకు ఈ డీల్‌ ఒక మంచి ఉదాహరణలాంటిదని పేర్కొన్నారు. కాగా ఆర్‌కామ్‌కు చెందిన స్పెక్ట్రమ్, మొబైల్‌ టవర్లు, ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్, మీడియా కన్వర్జెన్స్‌ నోడ్స్‌ను (ఎంసీఎన్‌) రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ కంపెనీ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ కొనుగోలు చేస్తోన్న విషయం తెలిసిందే.

ఈ డీల్‌ విలువ రూ.24,000– 25,000 కోట్ల శ్రేణిలో ఉండొచ్చని బ్యాంకింగ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఆర్‌కామ్‌కు రూ.45,000 కోట్లమేర రుణాలున్నాయి. ఎస్‌బీఐ సహా పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వంటి డజనుకుపైగా బ్యాంకులు ఆర్‌కామ్‌కు రుణాలిచ్చాయి.  

>
మరిన్ని వార్తలు