రియల్‌.. డబుల్‌

26 Feb, 2019 06:55 IST|Sakshi

గ్రేటర్‌ శివార్లలో రియల్‌ ఎస్టేట్‌ జోరు  

నిర్మాణాలకు కేరాఫ్‌గా శివారు ప్రాంతాలు  

గతేడాదితో పోలిస్తే ప్రాజెక్టులు రెట్టింపు  

‘అనరాక్‌ ప్రాపర్టీస్‌’ అధ్యయనంలో వెల్లడి  

సాక్షి, సిటీబ్యూరో: మహానగర పరిధిలోని శివారు ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రధానంగా నిర్మాణాలకు ఈ ప్రాంతాలు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. అల్ప, మధ్య ఆదాయ వర్గాలు అధికంగా కొనుగోలు చేసే గృహ సముదాయాలకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. నిర్మాణరంగ సంస్థలు గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి రెట్టింపు స్థాయిలో ప్రాజెక్టులు చేపట్టడమే ఇందుకు నిదర్శనం. గ్రేటర్‌లో మార్కెట్‌ ట్రెండ్స్‌పై ‘అనరాక్‌ ప్రాపర్టీస్‌’ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ మేరకు వెల్లడైంది. ముఖ్యంగా కొండాపూర్, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, షేక్‌పేట్, నార్సింగి, పుప్పాలగూడ, బాచుపల్లి, కొంపల్లి, బొల్లారం, ఎల్బీనగర్, హయత్‌నగర్, యాంజాల్‌ తదితర ప్రాంతాల్లో నూతన నిర్మాణ రంగ ప్రాజెక్టులు ఊపందుకుంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో రూ.40–80 లక్షల సెగ్మెంట్‌లో నివాస గృహాలతో పాటు సువిశాలమైన, విలాసవంతమైన ఫ్లాట్లు, విల్లాల కొనుగోళ్లు ఇటీవల భారీగా పెరిగాయని రియల్టీ రంగ వర్గాలు తెలిపాయి. ఇక విలాసవంతమైన(లగ్జరీ) ఇళ్ల విభాగంలో తెల్లాపూర్, కొల్లూర్, గోపనపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టుల్లో బుకింగ్స్‌ అత్యధికంగా ఉన్నట్లు పేర్కొన్నాయి. 

ఏటికేడు పెరుగుదల...   
నగర శివార్లలో 2017లో దాదాపు 6వేల ప్రాజెక్టులను విభిన్న నిర్మాణ రంగ సంస్థలు ప్రారంభించాయి. ఇక 2018లో 7వేల ప్రాజెక్టులు పూర్తి కాగా... ఈ ఏడాదిలో దాదాపు 15వేల నూతన ప్రాజెక్టులు సాకారమయ్యే అవకాశముందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐటీ, బీపీఓ, కేపీఓ, ఫార్మా, బల్క్‌డ్రగ్‌ పరిశ్రమలకు నిలయంగా మారిన గ్రేటర్‌లో... ఇటీవలి కాలంలో విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం కోసం పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటకల నుంచి భారీగా వలస వస్తున్నారు. వీరంతా నగర శివార్లలో వారి స్థోమతను బట్టి అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేస్తుండడం విశేషం.  

ధరలు ఇలా...   
శివార్లలో ఈసారి అపర్ణ, రాజపుష్ప, వాసవి, బ్రిగేడ్, సుమధుర తదితర నిర్మాణరంగ సంస్థలు నూతన ప్రాజెక్టులు చేపట్టాయి. ఈ ఏడాది చివరి నాటికి ఇవి పూర్తికానున్నట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అల్ప, మధ్య ఆదాయ వర్గాలు, వేతన జీవులు ప్రధానంగా రూ.40–80 లక్షల విలువ చేసే అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్‌ హౌస్‌లను కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. ఎగువ మధ్యతరగతి వర్గం కొనుగోలు చేసే ఇళ్లు, ఫ్లాట్లు, విల్లాల ధరలు చదరపు అడుగుకు రూ.4,000–6,500 వరకు ఉన్నాయి. ఇక సంపన్నశ్రేణి కొనుగోలు చేసే సువిశాలమైన లగ్జరీ విల్లాలు, ఫ్లాట్లు చదరపు అడుగుకు సుమారు రూ.7,500–13,000 వరకు పలుకుతున్నాయి.  

మరిన్ని వార్తలు