రా.. రమ్మంటున్న రాయితీలు

10 Jul, 2015 22:54 IST|Sakshi
రా.. రమ్మంటున్న రాయితీలు

- ధర తక్కువుంటే సరిపోదు.. అభివృద్ధికి ఆస్కారముండాలి
- సాఫ్ట్ లాంచ్ ఆఫర్లు లాభాసాటేనంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్:
స్థిరాస్తి రంగంలో కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించడానికి కంపెనీలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇందులో ఒక్కో సంస్థది ఒక్కో తీరు. కొన్ని సంస్థలు ఏదో ఒక బహుమతిని ప్రకటిస్తే.. ఇంకొన్ని ప్రత్యేక రాయితీని అందజేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు 50 లేదా 100 మంది కస్టమర్లకు రుసుములు తగ్గిస్తామంటే.. ఇంకొన్నేమో వారం రోజుల్లో తీసుకుంటే ధరలో పాతిక శాతం రాయితీ అంటూ ఆకర్షిస్తున్నాయి.
 
ఇటీవల నిర్మాణ రంగంలో పుట్టుకొచ్చిన కొత్త ట్రెండే సాఫ్ట్ లాంచ్ ఆఫర్లు. ఇనాగ్రల్ ఆఫర్, లాంచింగ్ ఆఫర్.. పేరు ఏదైనప్పటికీ వినియోగదారులకు, పెట్టుబడిదారులకు ఈ ఆఫర్లు లాభసాటే అంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు.
 
నిజంగా లాభమేనా..
ముందే కొటే లాభమేమిటి? అన్న సందేహం చాలామందికి కలగొచ్చు. ప్రాజెక్టు మొదలయ్యాక కొనడం కంటే ముందు తీసుకుంటే తక్కువ రేటుకొస్తుంది. ఉదాహరణకు ఒక కంపెనీ చదరపు అడుగుకి రూ. 3,000 చొప్పున అమ్మకాలు మొదలెట్టింది.. అదే సంస్థ ‘సాఫ్ట్ లాంచ్’లో చదరపు అడుగుకి రూ. 2,800కే ఇవ్వొచ్చు. ఇంకా తక్కువకు విక్రయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఇప్పుడు ధైర్యంగా అడుగు ముందుకేస్తే ప్రాజెక్టు ప్రారంభమయ్యేనాటికి ఫ్లాట్ రేటు పెరగడానికి ఆస్కారముంటుంది.
 
నిన్నటి ధర నేడుండదు.. నేటి ధర రేపుండదు..
హైదరాబాద్ రియల్టీ మార్కెట్ తీరు ఇదే. మన నిర్మాణ రంగం ప్రత్యేకత ఇదే. నగరంలో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. అభివృద్ధికి ఢోకా ఉండదు. ‘ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌ని చూసిన వారెవ్వరైనా ఇప్పుడు నగరాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు. ఐదేళ్లలో ఇంత మార్పులు చోటుచేసుకున్నాయా అని అనిపిస్తుంది. అదే ఉత్తరాది నగరాల్ని పరిశీలించండి. పదిహేనేళ్ల క్రితం అక్కడి మౌలిక సదుపాయాలు ఎలాగుండేవో ప్రస్తుతమూ అదే విధంగా ఉన్నాయి. మన నగరానికి.. కొన్ని ఇతర నగరాలకు గల తేడా ఇదే’ గత కొన్నేళ్లుగా వివిధ నగరాల్లో ఉద్యోగం చేసి నగరంలో స్థిరపడ్డ ఒక నిపుణుడి అభిప్రాయమిది. ఇక్కడి అభివృద్ధిని గమనించే వారంతా సాఫ్ట్ లాంచ్ ఆఫర్ల వైపు దృష్టి పెట్టి.. చౌక ధరలో ఫ్లాట్లను సొంతం చేసుకుంటున్నారు.
 
మన ఇష్ట ప్రకారమే..
వెంచర్ ఏదైనా మీరు మొదట కొనుగోలు చేస్తే కొత్త అల్లుడికి ఇచ్చినంత మర్యాద కంపెనీ మీకిస్తుంది. కంపెనీ స్పెసిఫికేషన్స్ నచ్చకపోతే మార్పులు చేయమంటే విసుక్కోకుండా చేసి పెట్టే అవకాశం ఉంటుంది. మీకు విట్రిఫైడ్ టైల్స్ ఇష్టమనుకోండి.. మార్బుల్ వేస్తామన్న కంపెనీ మీ డిమాండ్‌కు దిగివస్తుంది. ఇంటీరియర్ డిజైనింగ్ విషయంలో మార్పులున్నా చేసి పెడతారు. నాణ్యత విషయంలో రాజీపడరు. ప్రాజెక్టు ఆరంభంలోనే ప్రతికూల ప్రచారాన్ని ఏ కంపెనీ కూడా కోరుకోదు కాబట్టి.. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాయి.

వీరికీ లాభమే..
కేవలం కొనుగోలుదారులకే కాదు.. బిల్డర్లకు, నిర్మాణ సంస్థలకూ ఈ విధానం ద్వారా ప్రయోజనం ఉంది. అనుమతులు రాక ముందే బ్యాంకులు కానీ, ఆర్థిక సంస్థలు కానీ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించవు. తప్పనిసరి పరిస్థితుల్లో బిల్డర్ బయటి వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. మరి ఈ ఇబ్బందిని అధిగమించడానికి ‘సాఫ్ట్ లాంచ్’ అమ్మకాల్ని కొన్ని సంస్థలు ప్రకటిస్తాయి. ఆర్థిక వనరుల్ని సమకూర్చుకుంటాయి. అయితే ఇదంతా బిల్డర్‌కు కానీ, నిర్మాణ సంస్థలకు కానీ మార్కెట్లో ఉన్న పేరు ప్రఖ్యాతులపై ఆధార పడి ఉంటుంది.
 
నిర్ణయం మంచిదే..
సాఫ్ట్ లాంచ్‌లో కొనేటప్పుడు కేవలం ధర ఆధారంగా నిర్ణయం తీసుకోకూడదు. అవసరమైతే న్యాయవాదులు, నిపుణుల సలహా తీసుకోవాలి. మంచి రికార్డు, దీర్ఘకాలిక చరిత్ర, ఆర్థిక స్థోమత ఉన్న కంపెనీల ఆఫర్లనే ఎంచుకోండి. మీరు కొనబోయే వెంచర్ ఎక్కడుంది? ఆ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశమెంత? వంటి అంశాల్ని గమనించండి. చుట్టుపక్కల ఏమైనా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రానున్నాయా అన్న విషయానికి   పెద్దపీట వేయాలి.
 
- ఇంటికి అందం, ఆకర్షణ తెచ్చేది రంగులే. మారుతున్న అభిరుచులు, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఇప్పుడు చాలా మంది త్రీడీ లేదా థిక్ కలర్లనే ఇష్టపడుతున్నారు. వీటిలో దాదాపు 3,800 రకాల రంగులు లభ్యమతున్నాయి. ఒకే రంగు లేత, ముదురు షేడ్లలో లభ్యమవుతోంది. ఒకే రంగు ఒక కోణంలో ఒక విధంగా, ఇంకో కోణంలో ఇంకో విధంగా ఇలా త్రీడీ రంగులున్నాయి. భవనాలకు వేసే రంగులు యజమానుల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయని నిపుణులు మాట.

మరిన్ని వార్తలు