రియల్ వేషాలిక చెల్లవు!

25 Apr, 2015 00:59 IST|Sakshi
రియల్ వేషాలిక చెల్లవు!

‘మోసపూరిత బిల్డర్ల నుంచి కొనుగోలుదారుల్ని రక్షించేందుకు, స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి కోసం ప్రత్యేక స్థిరాస్తి నియంత్రణ బిల్లును తీసుకొస్తాం’ ఇది ప్రభుత్వ ప్రకటన.
 
‘స్థిరాస్తి నియంత్రణ బిల్లు అమల్లోకి వస్తే నిర్మాణ రంగానికి మేలు కంటే కీడే ఎక్కువ. ఈ బిల్లుతో అవినీతికి ఆస్కారం ఉండటంతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం కూడా ఉంది’ ఇది నిర్మాణ రంగంలోని నిపుణుల ఆవేదన.
 
‘ప్రకటనలతో ఆకర్షించి, నిర్మాణ పనుల్ని సాగదీస్తూ, సమయానికి ఫ్లాట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోన్న బిల్డర్లు, డెవలపర్లకు గుణపాఠం చెప్పాలంటే స్థిరాస్తి నియంత్రణ బిల్లు అమల్లోకి రావాల్సిందే’ ఇది కొనుగోలుదారులు అభిప్రాయం.

 
కొనుగోలుదారుల చేతికి బ్రహ్మాస్త్రం.. స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు
స్థిరాస్తి రంగంలో మోసాలకు కళ్లెం  అవకతవకలకు పాల్పడితే జైలు శిక్ష.. గుర్తింపు రద్దు కూడా

సాక్షి, హైదరాబాద్: తప్పుడు ప్రకటనలతో కొనుగోలుదారులను మోసం చేసే రియల్టర్ల వేషాలిక సాగవు. భారత నిర్మాణ రంగంలో పారదర్శకతను తీసుకొచ్చి, కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు రూపొందించిన ‘స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు-2013’పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదముద్ర వేశారు. ఇప్పుడు స్థిరాస్తి నిపుణులెవరిని కదిలించినా ఇదే చర్చ. అసలు స్థిరాస్తి నియంత్రణ బిల్లు అంటే ఏంటి? దీంతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం? వంటి అనేక విషయాలపై ‘సాక్షి రియల్టీ’ ఈవారం ప్రత్యేక కథనం.
 
రెండు నెలల్లోగా రిజిస్టర్..
స్థిరాస్తి నియంత్రణ బిల్లు అమల్లోకి వచ్చాక రెండు నెలల్లోగా బిల్డర్లు, ఏజెంట్లు, ప్రమోటర్లు, గుత్తేదార్లు, ఆర్కిటెక్ట్, స్ట్రక ్చరల్ ఇంజనీర్లు తమ పేర్లను, చిరునామాలను నమోదు చేసుకోవాలి. అలాగే ప్రాజెక్ట్ లే-అవుట్, అభివృద్ధి గడువు, భూమి స్థితి, చట్టపరమైన ఆమోదాల పరిస్థితి ఇలా స్థిరాస్తికి సంబంధించిన ప్రతి ఒక్కటీ నియంత్రణ సంస్థకు సమర్పించాలి. ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాతే ప్రాజెక్ట్‌లను ప్రారంభించాలి. పొందిన అనుమతులన్నింటినీ బిల్డర్లు తమ వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలి. ఫ్లాట్లను సూపర్ బిల్టప్ ఏరియా ప్రాతిపదికన కాకుండా కార్పెట్ ఏరియా ప్రాతిపదికన విక్రయించాలి.
 
ప్రస్తుత ప్రాజెక్ట్‌లూ బిల్లు పరిధిలోకే..
కొత్తగా నిర్మించే నివాస, వాణిజ్య ప్రాజెక్ట్‌లే కాదు స్వీయ అవసరాల కోసం కట్టే ప్రతి ప్రాజెక్ట్, నిర్మాణం పూర్తయి ఇంకా ధ్రువీకరణ పత్రాలు రాని ప్రాజెక్ట్‌లూ ఈ బిల్లు పరిధిలోకే వస్తాయి. వెయ్యి చ.మీ. లేదా కనీసం 30 ఫ్లాట్లుంటే ప్రతి ప్రాజెక్ట్ బిల్లు పరిధిలోకే వస్తుంది. నిర్మాణం చేపట్టబోయే ప్రాజెక్ట్ ఎంతకాలంలో పూర్తవుతుందో ముందుగానే వెల్లడించాలి.
 
50 శాతం సొమ్ము ఎస్క్రో ఖాతాలో..
బిల్డర్ ప్రారంభించే ప్రతి ప్రాజెక్టుకు ఒక ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెరవాలి. ఆ ప్రాజెక్ట్ కోసం సమకూర్చే నిధులను వాటి కోసమే ఖర్చు చేయాలి. కొనుగోలుదారుల నుంచి స్వీకరించిన సొమ్ములో కనీసం 50 శాతం సొమ్మును డెవలపర్లు ఎస్క్రో ఖాతాలో జమ చేయాలి. ఒక ప్రాజెక్ట్‌లోని కొనుగోలుదారుల్లో మూడింట రెండొంతుల మంది ఆమోదం లేకుండా ప్రాజెక్ట్ ప్లాన్లను, స్ట్రక్చరల్ డిజైన్లను మార్చడానికి వీల్లేదు.
 
తప్పు చేస్తే జైలు శిక్షే..
ప్రాజెక్ట్‌కు సంబంధించిన సమాచారం తప్పుగా ఇచ్చినట్లయితే 5 శాతం జరిమానా. పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లయితే నిర్మాణ సంస్థ గుర్తింపును రద్దు చేసే అధికారం నియంత్రణ సంస్థకు ఉంటుంది. ప్రాజెక్ట్‌ను నమోదు చేయించుకోకపోతే ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం సొమ్మును జరిమానా చెల్లించాలి. అప్పటికీ నిబంధనలను పాటించకపోతే మరో 10 శాతం జరిమానా లేదా మూడేళ్ల జైలు శిక్ష ఉంటుంది. రెండూ విధించవచ్చు కూడా.
 
ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు..
స్థిరాస్తి నియంత్రణ బిల్లుతో బిల్డర్లకు, బిల్డర్లతో కొనుగోలుదారులకూ ఎలాంటి సమస్యలెదురైనా సవాల్ చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తారు. వేగవంత పరిష్కారం కోసం ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది న్యాయ నిర్ణయాధికారులను నియమిస్తారు. వారి నిర్ణయాన్ని, నియంత్రణ సంస్థల నిర్ణయాన్ని అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో సవాల్ చేసుకోవచ్చు.తుది విజ్ఞప్తులను హైకోర్టులో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ప్రతిపాదిత చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ నియంత్రణ సంస్థలను ఏర్పాటు చేస్తారు. లేదా రెండు రాష్ట్రాలకు కలిపి ఒక సంస్థను లేదా ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేస్తారు.
 
స్థిరాస్తి నిపుణులేమంటున్నారంటే..
స్థిరాస్తి నియంత్రణ బిల్లు దేశీయ నిర్మాణ రంగానికి వ్యతిరేకంగా ఉంది. బడా బిల్డర్లు మాత్రమే తట్టుకొని నిలబడగలుగుతారు. ధరలను అమాంతం పెంచేస్తారు. దీంతో సామాన్యుని సొంతింటి కల మరింత దూరమవుతుంది.
నిర్మాణాలకు అనుమతులనిచ్చే సంస్థలను నియంత్రణ సంస్థ పరిధిలోకి తీసుకురాలేదు. అధిక శాతం నిర్మాణాలు ఆలస్యం జరిగేది ప్రభుత్వ విభాగాలు అనుమతులు ఆలస్యం చేయడం వల్లే. అలాంటప్పుడు ఇంటి నిర్మాణంలో ఆలస్యమైతే కేవలం బిల్డర్లు, డెవలపర్లకు జైలు శిక్ష విధించడం సరైంది కాదు.
స్థిరాస్తి నియంత్రణ బిల్లుతో చిన్న, మధ్య తరహా బిల్డర్లు నిలదొక్కుకోలేరు. కొనుగోలుదారులు చెల్లించే 50 శాతం సొమ్మును బ్యాంకులో జమ చేయాలనడం సరికాదు. దీంతో నగదు నిల్వల్లేక ఆయా బిల్డర్లు వ్యాపారాన్ని విస్తరించలేరు.  స్థిరాస్తి నియంత్రణ సంస్థకు పూర్తి స్థాయి అధికారాల్ని కల్పించడం వల్ల మళ్లీ లెసైన్సుల రాజ్యం మొదలవుతుంది.
 
స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి...
realty@sakshi.com

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు