రియల్టీకి ‘పెద్ద’ కష్టం!

11 Jan, 2017 01:44 IST|Sakshi
రియల్టీకి ‘పెద్ద’ కష్టం!

నోట్ల రద్దుతో 8 నగరాల్లో మార్కెట్‌ పతనం
నిర్మాణ సంస్థలకు రూ.22,600 కోట్ల నష్టం
44 శాతం పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నివేదికలో వెల్లడి  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో రూ.1,000, రూ.500 నోట్ల రద్దు స్థిరాస్తి రంగాన్ని గట్టిగానే దెబ్బతీసింది. ప్రత్యేకించి దేశంలోని 8 ప్రధాన నగరాల్లో నివాస సముదాయాల మార్కెట్‌ ఒక్కసారిగా స్తబ్దుగా మారిందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక వెల్లడించింది. ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్‌ నగరాల్లో నైట్‌ ఫ్రాంక్‌ ఈ సర్వే నిర్వహించింది. దేశంలో 2016 అక్టోబర్‌–డిసెంబర్‌ నెలల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్ల అమ్మకాలు 44 శాతం మేర పడిపోయాయని.. 2010 తర్వాత ఈ స్థాయిలో అమ్మకాలు పడిపోవటం ఇదే మొదటిసారని నివేదిక పేర్కొంది. ఈ శాతాలను గణాంకాల్లోకి మారిస్తే... నిర్మాణ సంస్థలకు అమ్మకాల రూపంలో రావాల్సిన రూ.22,600 కోట్లు, రాష్ట్రాలకు స్టాంప్‌ డ్యూటీ రూపేణా రావాల్సిన రూ.1,200 కోట్లు ఆదాయ నష్టం వాటిల్లినట్లు నివేదిక వివరించింది. 2015 అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య 8 నగరాల్లో 72,933 ఇళ్లు విక్రయం కాగా.. ఈ ఏడాదిలో 40,936 ఇళ్లే అమ్ముడయ్యాయి. అమ్మకాల్లోనే కాక కొత్త ఇళ్ల ప్రారంభంలోనూ 61 శాతం క్షీణత కనిపించింది.

నిండా మునిగిన ఢిల్లీ–ఎన్‌సీఆర్‌...
నగరాల వారీగా ప్రారంభాలు, అమ్మకాల్లో క్షీణతను గమనిస్తే... ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ రియల్టీ మార్కెట్‌ ఘోరంగా దెబ్బతింది. ఈ ప్రాంతంలో 2016 నాల్గువ త్రైమాసిక అమ్మకాలు 53%(6,765 యూ నిట్లు), కొత్త ప్రారంభాలు 73% మేర పడిపోయా యి. 2016 మొదటి 9 నెలలు స్థిరాస్తి అమ్మకాలు జోరుగానే సాగినా... ఆ తర్వాత కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో నిర్మాణ సంస్థలతో పాటు కొనుగోలుదారులూ సందిగ్ధంలో పడ్డారు. 

మరిన్ని వార్తలు