ఐవోసీకి నిల్వల సెగ..

31 Jan, 2019 02:32 IST|Sakshi

క్యూ3లో లాభం 91 శాతం క్షీణత

రూ. 717 కోట్లకు డౌన్‌  

న్యూఢిల్లీ: చమురు రేట్లు క్షీణించడం, అధిక ధరలకు ఖరీదు చేసిన ఇంధన నిల్వల విలువ పడిపోవడం తదితర కారణాలు ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఆయిల్‌ (ఐవోసీ) ఆర్థిక పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సంస్థ లాభం ఏకంగా 91 శాతం క్షీణించి రూ. 717 కోట్లకు పడిపోయింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 7,883 కోట్లు.

మరోవైపు టర్నోవరు రూ. 1.32 లక్షల కోట్ల నుంచి రూ. 1.6 లక్షల కోట్లకు చేరింది. నాలుగేళ్ల గరిష్ట స్థాయి నుంచి చమురు ధరలు క్షీణించడంతో.. అప్పటికే నిల్వ చేసి పెట్టుకున్న ఇంధన విలువ గణనీయంగా పడిపోయిందని, ఇది ఆర్థిక ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపిందని ఐవోసీ పేర్కొంది. ఇక దేశీయంగా ఇంధన అమ్మకాలు 3 శాతం పెరిగి 21.5 మిలియన్‌ టన్నులకు చేరాయని వివరించింది. బుధవారం బీఎస్‌ఈలో ఐవోసీ షేరు 2 శాతం క్షీణించి రూ. 134.65 వద్ద క్లోజయ్యింది. 
 

మరిన్ని వార్తలు