మార్కెట్ల ఈ దూకుడు ఎందుకంటే!

6 Jul, 2020 10:40 IST|Sakshi

దేశీ కంపెనీలలో విదేశీ పెట్టుబడులు

కార్పొరేట్‌ నిధుల సమీకరణ స్పీడ్‌

లిక్విడిటీ దన్ను కూడా..

ప్రతికూలతలున్నప్పటికీ మార్కెట్ల ర్యాలీ

కుంజ్‌ బన్సాల్‌, సీఐవో- సార్థీ గ్రూప్‌

వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. సెన్సెక్స్‌ 36,400కు చేరగా.. నిఫ్టీ 10,700 ఎగువన కదులుతోంది. ఇటీవల మార్కెట్లలో కనిపిస్తున్న సానుకూల ట్రెండ్‌నకు పలు కారణాలున్నట్లు కుంజ్‌ బన్సాల్‌ చెబుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో మార్కెట్లకు జోష్‌నిస్తున్న అంశాలతోపాటు.. కార్పొరేట్‌ నిధుల సమీకరణ వెనుకున్న కారణాలు తదితరాలపై పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..

ఆశావహం
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 కల్లోలం సృష్టిస్తున్నప్పటికీ దేశీయంగా మార్కెట్లు ఇటీవల హుషారుగా కదులుతున్నాయి. ఇన్వెస్టర్లలో ఆశావహ ధోరణి నెలకొంది. ఇందుకు పలు అంశాలు దోహదం చేస్తున్నాయి.గత మూడు నెలలుగా మార్కెట్లు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ బలపడుతున్నాయి. కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరగడం, లాక్‌డవున్‌లతో పారిశ్రామికం కుదేలవడం, ఆర్థిక మందగమనం వంటి ప్రతికూలతలున్నప్పటికీ మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయి. ప్రధానంగా మార్కెట్లకు లిక్విడిటీ.. అంటే చౌక నిధులు బూస్టింగ్‌నిస్తున్నాయి. వీటికితోడు ఇటీవల వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) వసూళ్లు పుంజుకుంటున్నాయి. ఏప్రిల్‌లో రూ. 40,000 కోట్లు నమోదుకాగా.. మే నెలలో రూ. 70,000 కోట్లకు, జూన్‌లో రూ. 90,000 కోట్లకు జీఎస్‌టీ వసూళ్లు పెరిగాయి. 

ఆటో విక్రయాలు
గత నెలలో ఆటో విక్రయాలు సైతం సానుకూల ధోరణిని సూచిస్తున్నాయి. వ్యవసాయ రంగం నుంచి లభించిన దన్నుతో ట్రాక్టర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ద్విచక్ర వాహన అమ్మకాలు సైతం ఇందుకు దన్నునిచ్చాయి. అయితే కార్లు, వాణిజ్య వాహన విక్రయాలు నిరాశపరచాయి. ఇక వ్యవసాయోత్పత్తిపై అంచనాలు బాగా పెరిగాయి. సాధారణ వర్షపాత అంచనాలు, పంటల విస్తీర్ణం వంటి అంశాలు ఇందుకు మద్దతివ్వనున్నాయి. ఇలాంటి పలు సానుకూల అంశాల కారణంగా కోవిడ్‌-19 వల్ల తలెత్తుతున్న ఆరోగ్య, ఆర్థిక సవాళ్లకు ఇన్వెస్టర్లు అంతగా ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ఈ నేపథ్యంలో అవకాశాలు అందిపుచ్చుకోగల ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ వంటి రంగాలు వెలుగులో నిలుస్తు‍న్నాయి. రంగాలవారీగా ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఇది కొంతకాలంపాటు కొనసాగవచ్చు.

జియో జోరు
ఇటీవల డిజిటల్‌, టెలికం సేవల సంస్థరిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా విక్రయం ద్వారా మాతృ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారీగా నిధులు సమీకరించింది. ఫేస్‌బుక్‌ తదితర పలు విదేశీ సంస్థలు రిలయన్స్‌ జియోలో పెట్టుబడికి ఆసక్తి చూపాయి. మరోవైపు టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ ప్రమోటర్లు కొంతమేర వాటాను విక్రయించారు. తద్వారా కంపెనీ బలోపేతానికి నిధుల సమీకరణ చేపట్టారు. ఇదే విధంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తగిన సమయంలో రుణభారాన్ని తగ్గించుకునేందుకు జియో ద్వారా నిధులను సమీకరించింది. తద్వారా పబ్లిక్‌ ఇష్యూ తదితరాలు చేపట్టేందుకు అనువైన పరిస్థితులను ఏర్పాటు చేసుకుంది. ఇవన్నీ సెంటిమెంటుకు బలాన్నిస్తున్నాయి. ఇక మరోవైపు కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ క్విప్‌, ప్రమోటర్‌ వాటా విక్రయం ద్వారా నిధులు సమీకరించింది. ఇదే విధంగా పలు బీమా రంగ కంపెనీలు సైతం వాటాలు విక్రయించాయి. నాణ్యమైన కంపెనీల వాటాలను కొనుగోలు చేసేందుకు పలు విదేశీ సంస్థలు ముందుకు వచ్చాయి. దీంతో కొన్ని వాటా విక్రయ ఆఫర్లు అధిక నిధులను ఆకట్టుకోగలిగాయి కూడా. తద్వారా దేశీ బిజినెస్‌లపట్ల విదేశీ ఇన్వెస్టర్లు చూపుతున్న ఆసక్తి వ్యక్తమవుతోంది. వెరసి ఇలాంటి పలు అంశాలు దేశీ స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు