ప్రత్యేక ఫార్మా క్లస్టర్లకు సిఫార్సు!

17 Mar, 2018 02:34 IST|Sakshi

చైనాకు ఫార్మా ముడి పదార్థాల ఎగుమతులపై దృష్టి   

ఫార్మెక్సిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఉదయ్‌ భాస్కర్‌

సాక్షి, విశాఖపట్నం: దేశంలో ఫార్మా సిటీల మాదిరిగా ప్రత్యేక (ఎక్స్‌క్లూజివ్‌) ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్టు ప్రభుత్వరంగ ఫార్మాస్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఫార్మెక్సిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌. ఉదయ్‌ భాస్కర్‌ తెలిపారు. దీనివల్ల ఫార్మారంగం వృద్ధి చెందుతుందన్నారు. విశాఖలో ఫార్మా ఇండస్ట్రీ సదస్సుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.

మందుల ఎగుమతుల్లో అంతర్జాతీయంగా భారత్‌ మూడో స్థానంలోను, వాల్యూలో 10వ స్థానంలో ఉందని చెప్పారు. చైనా నుంచి ఫార్మా దిగుమతుల స్థాయి నుంచి ఎగుమతుల స్థాయికి భారత్‌ ఎదుగుతోందన్నారు. చైనాలో మనకన్నా తక్కువ ధరలకే చాన్నాళ్లుగా యాంటీబయాటిక్స్, తదితర మందుల తయారీకి అవసరమయ్యే  ముడిపదార్థాల లభ్యమవుతుండడం వల్ల అక్కడ నుంచి వాటి దిగుమతికి ఎక్కువగా భారత్‌ ఆధార  పడుతోందన్నారు.

కానీ కొన్నాళ్లుగా చైనాలో ఔషధాల ఉత్పత్తి వ్యయం పెరగడంతో భారత్‌ నుంచి అక్కడకు ఎగుమతులు మొదలయ్యాయని, ఇది మనకు మంచి పరిణామమని తెలిపారు. ఇలాంటి వాటిని మనదేశంలో విస్తృతం చేస్తే ఇతర దేశాలకు గణనీయంగా ఎగుమతి చేయడానికి వీలుంటుందని, దీంతో ఫార్మా కంపెనీలు లాభాలు ఆర్జిస్తాయని వివరించారు. ప్రస్తుతం ఫార్మాక్సిల్‌  దృష్టి సారిస్తోందన్నారు. చాలా దేశాలు ఔషధ వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని, అందుకు తక్కువ ధరలకే మందుల లభ్యత తప్పనిసరన్నారు.
 
మందుల ఎగుమతుల్లో భారత్‌కు చైనాతో పాటు అమెరికా, యూరప్‌ దేశాలు ప్రధాన పోటీదార్లుగా ఉన్నారని చెప్పారు. రెగ్యులేటెడ్‌ మార్కెట్‌కి భారత్‌ 50 శాతం మందులను ఎగుమతి చేస్తోందన్నారు. ఔషధాల దిగుమతులపై ఉన్న నిషేధంపై   ప్రభుత్వం, సంబంధిత సంస్థలతో సంప్రదింపులు జరుపుతుందని, ఎగుమతిదార్లకు ప్రయోజనకరంగా ఉండేలా ఫార్మా పాలసీ రూపొందించడంలో ఫార్మెక్సిల్‌ ప్రభుత్వానికి సలహా ఇస్తుందని వివరించారు.


ఢిల్లీలో ఫార్మా, హెల్త్‌కేర్‌ ఎగ్జిబిషన్‌..
కొన్ని దేశాల్లో మన దేశ ఔషధ ఉత్పత్తుల ఎగుమతులకు రిజిస్ట్రేషన్‌ అవసరమని ఉదయ్‌ భాస్కర్‌ తెలిపారు. అందుకయ్యే ఖర్చులో 50 శాతం గాని, లేదా రూ.50 లక్షలు మించకుండా రాయితీలిచ్చి ప్రోత్సహిస్తామన్నారు. త్వరలో ఢిల్లీలో ఫార్మా, హెల్త్‌కేర్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తామని చెప్పారు.

దీనికి ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల నుంచి 600 మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో దేశంలోని వివిధ ఫార్మా కంపెనీల స్టాళ్లు ఏర్పాటు చేస్తామని, ఎగుమతులు, ఆయా దేశాలకు అవసరాలేమిటన్న దానిపై ప్రతినిధులతో చర్చలుంటాయని వివరించారు. దేశంలో ఫార్మెక్సిల్‌కు ఔషధ ఎగుమతులు చేసే 3500 మంది సభ్యులున్నారని ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు