మళ్లీ రికార్డ్‌ క్లోజింగ్‌

31 May, 2019 08:58 IST|Sakshi

ప్రధానిగా రెండోసారి మోదీ ప్రమాణం

బలపడ్డ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌

ఎఫ్‌అండ్‌ఓ చివరి రోజైనా, రోజంతా లాభాలే

ఒక్క రోజు విరామం తర్వాత మళ్లీ రికార్డ్‌ క్లోజింగ్‌

330 పాయింట్ల లాభంతో 39,832 వద్ద ముగింపు

85 పాయింట్లు పెరిగి 11,946 నిఫ్టీ  

ఒక్క రోజు విరామం తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు మళ్లీ కొత్త శిఖరాల వద్ద ముగిశాయి. మే డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల చివరి రోజు అయినప్పటికీ, గురువారం స్టాక్‌ మార్కెట్‌ భారీగానే లాభపడింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లలో కొనుగోళ్ల జోరు కారణంగా సెన్సెక్స్‌ 330 పాయింట్లు లాభపడి 39,832 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 85 పాయింట్లు లాభపడి 11,946 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలకు ఇవి జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపులు. విద్యుత్తు, టెలికం, ఇంధన, ఆర్థిక, ఐటీ షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగగా, వాహన, లోహ, రియల్టీ రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. 

రోజంతా లాభాలే....
నరేంద్ర మోదీ నేతృత్వంలో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడిందని విశ్లేషకులంటున్నారు. ఈ ప్రభుత్వం నుంచి మరిన్ని సంస్కరణలు వస్తాయనే ఆశాభావంతో కొనుగోళ్లు వెల్లువెత్తాయని వారంటున్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోయినా, ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గడం కలిసివచ్చింది. సెన్సెక్స్, నిఫ్టీలు స్వల్ప లాభాల్లో ఆరంభమైనప్పటికీ, అంతకంతకూ ఆ లాభాలు పెరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 410 పాయింట్లు, నిఫ్టీ 105 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.

ఆ నాలుగు షేర్ల వల్లే భారీ లాభాలు....
హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్‌ షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. సెన్సెక్స్‌ మొత్తం 330 పాయింట్ల  లాభంలో ఈ నాలుగు షేర్ల లాభాలే 212 పాయింట్ల మేర ఉన్నాయి. దీంట్లో హెచ్‌డీఎఫ్‌సీ వాటా 66 పాయింట్లు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 55 పాయింట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 50 పాయింట్లు, టీసీఎస్‌ 41 పాయింట్లు చొప్పున ఉన్నాయి.  
స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.80,000 కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాప్‌ రూ.80,000 కోట్లు పెరిగి రూ.1,54,43,364 కోట్లకు ఎగసింది.  
ఎన్‌టీపీసీ సెన్సెక్స్‌లో భారీగా 3.4 శాతం లాభంతో రూ.135 వద్ద ముగిసింది.
మన్‌పసంద్‌ బేవరేజేస్‌ షేర్‌ 10 శాతం పతనమై జీవిత కాల కనిష్ట స్థాయి, రూ.57కు పడిపోయింది. గత నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో ఈ షేర్‌ దాదాపు సగం పడిపోయింది. జీఎస్‌టీ ఎగవేత కేసులో అరెస్టైన ఈ కంపెనీ అధికారులకు బెయిల్‌ లభించలేదన్న వార్త తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపించింది. 

మరిన్ని వార్తలు