ఫారం 26ఏఎస్‌ తప్పుల తడకైతే..

6 Aug, 2018 01:29 IST|Sakshi

ఆదాయ పన్ను శాఖ నిర్వహించే వెబ్‌సైట్‌లో మీకు సంబంధించిన ఆదాయ పన్నుల రికార్డును ఫారం 26ఏఎస్‌ అంటారు. మీరు చెల్లించే టీడీఎస్, అడ్వాన్స్‌ ట్యాక్స్, సెల్ఫ్‌ అస్సెస్‌మెంట్‌ ట్యాక్స్‌ ఈ రికార్డులో నమోదవుతుంది. స్వయంగా చెల్లించే ముందస్తు పన్ను, ఆ తరువాత సెల్ఫ్‌ అస్సెస్‌మెంట్‌ ట్యాక్స్‌ వివరాలతో పాటు మీ పేరు, చిరునామా, పాన్‌ కార్డ్‌ నంబర్‌ వివరాలు ఉంటాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు బ్యాంకులో జమచేసిన మొత్తం ఆ బ్యాంకు సిబ్బంది సాఫ్ట్‌వేర్‌ ద్వారా డిపార్ట్‌మెంట్‌కు చేరవేయడం ద్వారా వివరాలు ఈ రికార్డులో వెంటనే నమోదవుతుండగా.. టీడీఎస్, టీసీఎస్‌ వివరాలు మాత్రం తత్సంబంధిత అధికార కేంద్రాల ద్వారా అప్‌లోడ్‌ అవుతాయి. ఈ క్రమంలో ఎన్నో తప్పులు జరగడం పరిపాటిగా మారిపోయింది. నైపుణ్యత లేని సిబ్బంది, పని ఒత్తిడి లాంటి అనేక కారణాల వల్ల తప్పులు జరుగుతూనే ఉన్నాయి.  

తప్పులు ఏవైవుండచ్చు... 
►పాన్‌ నంబర్‌ తప్పు రాయడం 
►టాన్‌ నంబర్‌ తప్పు రాయడం 
►చలాన్‌ నంబర్‌ సరిగ్గా రాయకపోవడం 
►డేటా ఎంట్రీలో తప్పులు 
►తప్పు చలాన్‌ కట్టడం 
►పూర్తి సమాచారం లేకపోవడం 
►తప్పుడు సమాచారం 
►జమ చేసిన మొత్తం/చెల్లించిన మొత్తంలో తప్పులు రాయడం.
►చివరి 3 నెలలు పన్ను రికవరీ చేసి ఆ సమాచారంతో పాటు కేవలం 3 నెలల జీతం / పెన్షన్‌ మాత్రమే అప్‌లోడ్‌ చేసి మిగిలిన 9 నెలల ఆదాయం వివరాలు అప్‌లోడ్‌ చేయకపోవడం.
194సీ, 194జే వంటి సెక్షన్‌ వివరాలు తప్పులు రాయడం.
►మినహాయింపులు, తగ్గింపు విషయాలను ప్రస్తావించకుండా పూర్తి ఆదాయాన్ని రాసి.. ఫారం 16లో నికర ఆదాయం రాయడం వల్ల ఈ రెండూ ఒకదానితో ఒకటి కలవకపోవడం.. 
ఇలాంటివి అనేక తప్పులు రావడం సర్వసాధారణంగా మారిపోయినందున మీరు రిటర్నులు దాఖలుచేసే రోజున ఫారం 26ఏఎస్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఒకసారి సరిచూసుకోవడం మంచిది.  

వివరాలు సరిగా లేకపోతే... 
►డిడక్టర్, యజమాని, బ్యాంకు, ఇతరుల వద్దకు వెళ్లి తప్పులు సరిదిద్దించండి.
►అసలు ఆ వ్యవహారాలు మీవేనేమో చూడండి.
►రెండు సార్లు పేమెంట్లు ఉన్నాయోమో చూసుకోండి. 
►మీరు చెల్లించినవి నమోదైనవో లేదో చూడండి.
►ఏ మాత్రం తేడా ఉన్నా వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించండి.
►మీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అన్నీ సరిగ్గా ఉండి.. ఫారం 26ఏఎస్‌లో ఆ వివరాలు అప్‌లోడ్‌ కాకపోతే గడువుతేదీ వరకు వేచి ఉండకండి. అన్ని కాగితాలు సమకూర్చుకుని, సరిదిద్దుకుని, సరిచేసుకుని రిటర్నులు వేయండి..  

తప్పు దిద్దుకోవడానికి మూడు సూత్రాలు..  డిడక్టర్‌ని సంప్రదించండి.
టిన్‌ కాల్‌ సెంటర్, నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్, 3 ఫ్లోర్, సఫైర్‌ చాంబర్స్‌ బనీర్‌ టెలిఫోన్‌ ఎక్సే్ఛంజ్‌ సమీపం, పుణే – 411045 అడ్రస్‌ను ఆశ్రయించండి. 020 – 27218080 నంబర్‌కు కాల్‌ చేయండి. టిన్‌ఇన్‌ఫోఃఎన్‌ఎస్‌డీఎల్‌ డాట్‌ కో డాట్‌ ఇన్‌ వెబ్‌సైట్‌ను ద్వారా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా కానీ స్వయంగా అధికారులను కానీ అభ్యర్థించండి. వాళ్లు మీకు కలిగిన ఇబ్బంది గురించి వింటారు. మీకు ఉపశమనం దొరుకుతుంది.
- కె.సీహెచ్‌. ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి
- కె.వి.ఎన్‌ లావణ్య

ట్యాక్సేషన్‌ నిపుణులు 

మరిన్ని వార్తలు