ప్రధాని మోదీకి రాహుల్‌ గాంధీ ఛాలెంజ్‌

24 May, 2018 15:22 IST|Sakshi
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గత కొన్ని రోజుల నుంచి వినియోగదారులకు భారీగా వాత పెడుతున్న సంగతి తెలిసిందే. పెరిగేదే కానీ, అసలు తగ్గేదే కనిపించడం లేదు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రభుత్వం త్వరలోనే తగ్గిస్తామంటూ మాటలు చెప్పుకొస్తుంది కానీ, ఎప్పుడు తగ్గింపు చేపడతామనే విషయంపై స్పష్టమైన ప్రకటన ఇవ్వలేకపోతోంది. ఓ వైపు ఇంధన ధరలను సైతం జీఎస్టీ కిందకి తీసుకొచ్చి, వాటి ధరలను తగ్గించాలని పలువురు కోరుతున్నారు. మండుతున్న ఈ ధరలపై విపక్షాల సైతం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయినప్పటికీ ఈ విమర్శలపై ప్రధాని మోదీ నోరైనా మెదపడం లేదు. తాజాగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఇంధన ధరలు విపరీతంగా పెరగడంపై మండిపడ్డారు. 

‘డియర్‌ పీఎం, విరాట్‌కోహ్లి ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను మీరు స్వీకరిస్తున్నట్టు చూడటం ఆనందదాయకంగా ఉంది. నా నుంచి కూడా ఓ ఛాలెంజ్‌ ఉంది. ఇంధన ధరలను తగ్గించాలి లేదంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసన కార్యక్రమాన్ని చేపడుతుంది. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ధరలను తగ్గించాల్సి వస్తుంది. దీనిపై మీ స్పందన ఎలా ఉంటుందో చూస్తాం’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. #ఫిట్‌నెస్‌ఛాలెంజ్‌ మాదిరి #ఇంధనఛాలెంజ్‌ అంటూ రాహుల్‌ గాంధీ, ప్రధానికి ఒక గట్టి హెచ్చరికనే జారీచేశారు. మరోవైపు అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా పెరుగుతుండటంతో, దేశీయంగానే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. అంతేకాక డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా క్షీణించడం కూడా దీనిపై ప్రభావం చూపుతోంది. కానీ ప్రభుత్వాలు విధించే పన్నులను తగ్గిస్తే ఈ ధరలు తగ్గే అవకాశాలున్నాయి. కానీ పన్నులు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. 

పన్నులు తగ్గిస్తే, ఆ ప్రభావం సంక్షేమ పథకాలపై పడుతుందని కేంద్రం అంటోంది. గత 11 రోజుల్లో 11 సార్లు ఈ ధరలు పెరిగాయి. అంటే ఒక్కరోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గలేదు. గురువారం కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 19 నుంచి 31 పైసల శ్రేణిలో పెరిగాయి. నేడు లీటరు పెట్రోల్‌ ధర ఢిల్లీలో రూ.77.47గా , కోల్‌కతాలో రూ.80.12గా, ముంబైలో రూ.85.29గా, చెన్నైలో రూ.80.42గా ఉంది. అదేవిధంగా లీటరు డీజిల్‌ ధర ఢిల్లీలో రూ.68.53గా, కోల్‌కతాలో రూ.71.08గా, ముంబైలో రూ.72.96గా, చెన్నైలో రూ.72.35గా నమోదైంది.

మరిన్ని వార్తలు