ఫిబ్రవరిలో తగ్గిన వాణిజ్యలోటు

16 Mar, 2019 01:06 IST|Sakshi

ఎగుమతుల విలువ  26.67 బిలియన్‌ డాలర్లు

దిగుమతుల విషయంలో ఈ మొత్తం 36.26 

బిలియన్‌ డాలర్లు  వెరసి వాణిజ్యలోటు 9.6 బిలియన్‌ డాలర్లు  

న్యూఢిల్లీ: ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు ఫిబ్రవరిలో ఉపశమించింది. దిగుమతులు తగ్గడం దీనికి ప్రధాన కారణం. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే...

► దిగుమతుల విషయంలో ఈ మొత్తం 36.26 బిలియన్‌ డాలర్లు. గత ఏడాది (2018 ఫిబ్రవరి) ఇదే నెలతో పోల్చిచూస్తే, ఈ విలువ 5.4 శాతం తగ్గింది. 
►    వెరసి వాణిజ్యలోటు ఫిబ్రవరిలో 9.6 బిలియన్‌ డాలర్లు.  వాణిజ్యలోటు 2018 ఫిబ్రవరిలో 12.3 బిలియన్‌ డాలర్లు అయితే, 2019 జనవరిలో ఈ విలువ 14.73 బిలియన్‌ డాలర్లు. 
►పసిడి, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు  తగ్గాయి. దీనితో దిగుమతులు మొత్తంగా తగ్గాయి. పసిడి దిగుమతులు 11 శాతం తగ్గి 2.58 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 2.89 బిలియన్‌ డాలర్లు. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు 8 శాతం తగ్గి 9.37 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 

ఏప్రిల్‌– ఫిబ్రవరి మధ్య...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌– ఫిబ్రవరి మధ్య ఎగుమతుల విలువ 8.85 శాతం పెరిగి 298.47 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతుల విలువ 9.75 శాతం పెరిగి 464 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు దాదాపు 166 బిలియన్‌ డాలర్లు. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ విలువ 149 బిలియన్‌ డాలర్లు. 

అవరోధాలను  అధిగమిస్తున్నాం: ఎఫ్‌ఐఈఓ
అంతర్జాతీయంగా వాణిజ్య రక్షణాత్మక విధానాలు ఉన్నాయి. కఠిన అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు ఉన్నాయి. దేశీయంగానూ ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ ఎగుమతులు కొంత సానుకూలంగానే నమోదయ్యాయి. మొత్తం 30 ప్రధాన గ్రూపుల్లో 18 సానుకూల ఫలితాలను అందించాయి. 
– గణేశ్‌ కుమార్‌ గుప్తా, ఎఫ్‌ఐఈఓ

సేవలు తగ్గాయి...
సేవల ఎగుమతులు 2018 డిసెంబర్‌తో పోల్చితే, 2019 జనవరిలో 1.02 శాతం తగ్గాయి. 17.75 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక సేవల దిగుమతులు కూడా ఇదే కాలంలో 3.07 శాతం తగ్గి 11.03 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 

>
మరిన్ని వార్తలు