సంస్కరణల ఆశలతో...

23 Jul, 2015 01:22 IST|Sakshi
సంస్కరణల ఆశలతో...

ముంబై : ఇటీవల పతనంతో బాగా తగ్గి ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో కొనుగోళ్ల కారణంగా స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల్లో ముగిసింది. దీనికి సంస్కరణలపై ఆశలు కూడా జతకావడం,  రిలయన్స్ ఇండస్ట్రీస్ 4.2 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 2.7 శాతం పెరగడంతో  బీఎస్‌ఈ సెన్సెక్స్ 323 పాయింట్లు లాభపడి 28,505 పాయింట్ల వద్ద,  నిఫ్టీ 104 పాయింట్ల లాభంతో 8,634 పాయింట్ల వద్ద ముగిశాయి. దాదాపు మూడు నెలల కాలంలో ఇదే అత్యధిక ముగింపు. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా మన మార్కెట్ మాత్రం దూసుకుపోయింది. బ్యాంక్, ఆర్థిక సేవలు, వాహన, ఆయిల్,గ్యాస్ షేర్ల దన్నుతో స్టాక్ మార్కెట్ లాభపడింది. సెన్సెక్స్ లాభంలో దాదాపు సగం రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు పెరగడం వల్లే వచ్చాయి.

 ఆర్‌ఐఎల్ జోరు
 రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను శుక్రవారం వెల్లడించనున్నది. ఈ ఫలితాలు అంచనాలను మించుతాయనే అంచనాలతో  రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ఏడాది గరిష్ట స్థాయి(రూ.1,054)ని తాకింది. చివరకు 4.2 శాతం లాభంతో రూ.1,050 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా లాభపడ్డ షేర్ ఇదే.

 30కి 22 షేర్లు లాభాల్లోనే..
 30 సెన్సెక్స్ షేర్లలో 22 షేర్లు లాభాల్లోనే ముగిశాయి. 1,770 షేర్లు లాభాల్లో, 1,055 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,926 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.15,963 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.3,09.332 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.450 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.352 కోట్ల నికర అమ్మకాలు జరిపారు.
 అరబిందో ఫార్మా 1:1 నిష్పత్తి బోనస్ షేర్ల కింద వాటాదారులకు 29.19 కోట్ల షేర్లను జారీ చేసింది. దీంతో మొత్తం ఈక్విటీ షేర్ల సంఖ్య 58.39 కోట్లకు చేరింది.

మరిన్ని వార్తలు