ఇది స్ప్రింట్ కాదు.. మారథాన్...

7 Nov, 2015 01:54 IST|Sakshi
ఇది స్ప్రింట్ కాదు.. మారథాన్...

ఆర్థిక సంస్కరణల అమలుపై ప్రధాని మోదీ
* సంస్కరణలు సమ్మిళితంగా ఉండాలని వ్యాఖ్య
* జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యం కావాలి
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణలనేవి ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ, విస్తృత స్థాయిలో ప్రయోజనాలు కల్పించేలా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సంస్కరణల లక్ష్యం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే తప్ప.. మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కడం కాకూడదని ఆయన వ్యాఖ్యానించారు.

శుక్రవారం 6వ ఢిల్లీ ఎకనామిక్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. సంస్కరణలను పరుగుపందెంతో పోలుస్తూ.. వీటి అమలనేది స్వల్పదూరం వేగంగా పరుగెత్తి పూర్తి చేసే స్ప్రింట్ కాదని నిలకడగా సుదీర్ఘ దూరాన్ని అధిగమించాల్సిన మారథాన్ లాంటిదని మోదీ చెప్పారు. ప్రభుత్వం సమ్మిళిత సంస్కరణలను అమలు చేసే లక్ష్యంతో ముందుకెడుతోందన్నారు.

తాము అధికారంలోకి రాకముందుతో పోలిస్తే.. అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో భారత్ ఎంతో మెరుగుపడిందని ప్రధాని చెప్పారు. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి, విదేశీ పెట్టుబడులు, ఆదాయాలు పెరగ్గా.. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం తగ్గిందని ఆయన వివరించారు.
 
అవినీతికి చెక్..: వృద్ధికి ప్రతిబంధకాలైన అవినీతి, పన్ను ఎగవేతలు, మనీ లాండరింగ్ మొదలైన వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంద ని ప్రధాని చెప్పారు. ఈ దిశగా చేపట్టిన చర్యలవల్లే విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న సుమారు రూ.10,500 కోట్లు నల్లధనాన్ని గుర్తించడం జరిగిందన్నారు.
 
గోల్డ్ స్కీములపై 3వేల కాల్స్..: ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసిడి పథకాలకు మంచి స్పందన కనిపించిందని, వీటి వివరాల కోసం టోల్ ఫ్రీ నంబరుకు 3,000 పైచిలుకు కాల్స్ వచ్చాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. గోల్డ్ డిపాజిట్ పథకాన్ని దశలవారీగా దేశమంతటా అమల్లోకి తేనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు