పటిష్ట వృద్ధికి వాజ్‌పేయి సంస్కరణలు దోహదం

22 Aug, 2018 00:46 IST|Sakshi

ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్‌ సన్యాల్‌

బెంగళూరు: వాజ్‌పేయీ నేతృత్వంలోని ప్రభుత్వ సంస్కరణలే దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడపీ) పటిష్ట వృద్ధికి దోహదపడ్డాయని ఆర్థిక శాఖకు ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్‌ సన్యాల్‌ పేర్కొన్నారు. పీటీఐకి ఇచ్చిన ఒక ఈ మెయిల్‌ ఇంటర్వూలో ఆయన వివిధ అంశాలపై సమాధానాలు ఇచ్చారు. మార్కెట్‌ సంస్కరణల ద్వారా పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి పాటుపడిన వ్యక్తి వాజ్‌పేయి అని పేర్కొన్న ఆయన,  తన దార్శనిక నాయకత్వంలో ప్రవేశపెట్టిన రెండో తరం సంస్కరణలు పెట్టుబడుల వాతావరణానికి తోడ్పడ్డాయన్నారు. 

ఫలితంగా భారత్‌ వేగంగా వృద్ధి సాధించేందుకు దోహదపడిందని వివరించారు. స్వర్ణ చుతుర్భుజి ప్రాజెక్టు, నూతన టెలికం విధానం, సర్వశిక్షా అభియాన్, ఫిస్కల్‌ రెస్పాన్స్‌బులిటీ యాక్ట్‌ వంటి చర్యలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వల్ల 2009 నుంచి 2014 మధ్య దేశ వృద్ధి కొంత ప్రతికూలతలకు గురయ్యిందని అన్నారు.

1999–2004 మధ్య భారత్‌ కరెంట్‌ అకౌంట్‌ లోటు  జీడీపీలో 0.5 శాతం మిగుల్లో ఉందని పేర్కొన్న ఆయన, 2004–09లో 1.2 శాతం లోటుకు మారిందన్నారు. 2009–14 మధ్య 3.3 శాతానికి పెరిగితే, 2014–18లో 1.2 శాతానికి మెరుగుపడినట్లు వివరించారు. అలాగే 2009–14 మధ్య 10.4 శాతంగా ఉన్న వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ప్రస్తుతం దాదాపు 4 శాతానికి దిగివచ్చిందని వివరించారు.  

మరిన్ని వార్తలు