పరిశ్రమలు మళ్లీ మైనస్‌!

13 Dec, 2019 02:22 IST|Sakshi

తయారీ.. విద్యుత్‌.. మైనింగ్‌... అన్నీ తిరోగమనమే

అక్టోబర్‌ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాల నిరాశ

మైనస్‌ 3.8 శాతం క్షీణత

వరుసగా మూడు నెలల నుంచీ ఇదే ధోరణి

న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి అక్టోబర్‌లో తీవ్ర నిరాశను మిగిల్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా –3.8 శాతం క్షీణత నమోదయ్యింది. అంటే 2018 ఇదే నెలకన్నా తక్కువ పారిశ్రామిక ఉత్పత్తి నమోదయ్యిందన్నమాట. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో మెజారిటీ వాటా కలిగిన తయారీరంగంసహా విద్యుత్, మైనింగ్‌ వంటి కీలక రంగాలన్నింటిలో క్షీణరేటే నమోదయ్యింది. 2018 ఇదే నెల్లో పారిశ్రామిక ఉత్పత్తి 8.4 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది.  గురువారం  విడుదలైన గణాంకాల్లో కీలక విభాగాలను చూస్తే...

తయారీ రంగం: సూచీలో దాదాపు 60 శాతంపైగా వెయిటేజ్‌ ఉన్న ఈ రంగంలో –2.1 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 అక్టోబర్‌లో ఈ విభాగం 8.2 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది. ఆరి్థక సంవత్సరం (ఏప్రిల్‌  నుంచి)లో అక్టోబర్‌ వరకూ చూస్తే, వృద్ధి రేటు 5.8% నుంచి 0.5%కి పడింది.  
విద్యుత్‌: ఈ విభాగం కూడా 10.8 శాతం వృద్ధి బాట నుంచి (2018 అక్టోబర్‌లో) –12.2 శాతం క్షీణతలోకి జారింది. ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో వృద్ధి 6.8 శాతం నుంచి 1.6 శాతానికి పడిపోయింది.  
మైనింగ్‌: ఈ విభాగంలో 7.3 శాతం వృద్ధి రేటు – 8 శాతం క్షీణత (2019 అక్టోబర్‌)లోకి పడింది. ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకూ తీసుకున్నా ఈ విభాగం 3.9 శాతం వృద్ధిబాట నుంచి –0.4 శాతం క్షీణతలోకి జారింది.  
క్యాపిటల్‌ గూడ్స్‌: ఇక భారీ యంత్రసామాగ్రి ఉత్పత్తికి, డిమాండ్‌కు ప్రతిబింబమైన ఈ రంగంలో భారీగా –21.9% క్షీణించింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ రంగం భారీగా 16.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది.
రసాయనాలు: 31.8% వృద్ధి నమోదయ్యింది.
ఏడు నెలల్లో... ఏప్రిల్‌తో ప్రారంభం నుంచీ అక్టోబర్‌ వరకూ ఏడు నెలల కాలాన్ని చూస్తే, వృద్ధి రేటు 5.7 శాతం నుంచి (2018 ఇదే కాలంలో) 0.5 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది జూలైలో వృద్ధి రేటు 4.9 శాతంగా నమోదయ్యింది.

అదుపు తప్పిన ధరలు
►నవంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.54 శాతం
►మూడేళ్ల గరిష్ట స్థాయి ఇది...

న్యూఢిల్లీ: రిటైల్‌ ధరలు అదుపుతప్పాయి.  ఈ సూచీ నవంబర్‌లో మూడేళ్ల గరిష్టం 5.54 శాతానికి చేరింది. అంటే 2018 నవంబర్‌తో పోలి్చచూస్తే, 2019 నవంబర్‌లో నిత్యావసరాల వినియోగ వస్తువుల బాస్కెట్‌ ధర మొత్తంగా 5.54 శాతం పెరిగిందన్నమాట. 2016 జూలై (6.07 శాతం) తరువాత ధరల పెరుగుదల తీవ్రత ఇంత స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. 2018 నవంబర్‌లో ధరల పెరుగుదల రేటు 2.33 శాతం. అక్టోబర్‌లో కూడా రిటైల్‌ ద్రవ్యోల్బణం భారీగా 4.62 శాతం నమోదయ్యింది.

మరిన్ని వార్తలు