వచ్చే ఏడాది కొత్త కార్పొరేట్ ఏజెంట్ నిబంధనలు

7 Aug, 2015 01:06 IST|Sakshi
వచ్చే ఏడాది కొత్త కార్పొరేట్ ఏజెంట్ నిబంధనలు

సహారా లైఫ్ పటిష్టంగానే ఉంది
- ఈ ఏడాది జీవిత బీమా వ్యాపారంలో వృద్ధి
- ఐఆర్‌డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్
- హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సీఎస్‌సీ సురక్షా పథకం షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
జీవిత బీమా రంగంలో కార్పొరేట్ ఏజెంట్ల కొత్త నిబంధనలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నట్లు బీమా అభివృద్ధి నియంత్రణ మండలి (ఐఆర్‌డీఏ) ప్రకటించింది. దీనికి సంబంధించి వచ్చే మూడు వారాల్లోగా గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నట్లు ఐఆర్‌డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ తెలిపారు. ఒక కార్పొరేట్ ఏజెంట్ గరిష్టంగా మూడు కంపెనీల పాలసీలను విక్రయించే విధంగా ఈ నిబంధనలను రూపొందించామని, దీనికి అనుగుణంగా కంపెనీలు ఏజెంట్లను మార్చుకోవడానికి తగినంత సమయం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఒక కార్పొరేట్ ఏజెంట్ ఒక కంపెనీ పాలసీ మాత్రమే విక్రయించాల్సి ఉంది.

గురువారం హైదరాబాద్‌లో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ కామన్ సర్వీస్ సెంటర్స్ ( మీ సేవా కేంద్రాలు) ద్వారా విక్రయించే పాలసీ ‘సీఎస్‌సీ సురక్ష’ను విజయన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జీవిత బీమా వ్యాపారంలో 15 శాతం వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీమా కంపెనీలు ఐపీవోల ద్వారా నిధులు సమీకరించడానికి నిబంధనలు జారీ చేసినా ఇప్పటి వరకు ఒక కంపెనీ కూడా ఇందుకోసం దాఖలు చేసుకోలేదని చెప్పారు. సహారా లైఫ్ ఆర్థికంగా పటిష్టంగానే ఉందని, దీనిపై ఎటువంటి ఫిర్యాదులు రాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ మధ్యనే సహారా మ్యూచువల్ ఫండ్‌ను సెబీ రద్దు చేసిన సంగతి తెలిసిందే.

డిమ్యాట్ రూపంలో బీమా పాలసీలను అందించే రిపాజిటరీ సేవలకు స్పందన అంతంత మాత్రంగానే ఉందని, ఇప్పటి వరకు కేవలం 3 లక్షలు పాలసీలు మాత్రమే రిపాజిటరీ రూపంలో ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీమా పథకాలకు మంచి స్పందన వచ్చిందని, ఇప్పటి వరకు 11 కోట్లకు పైగా మంది ఈ పథకాల్లో సభ్యులుగా చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆంధ్ర, తెలంగాణ హెడ్ రామకృష్ణ హెగ్డే,  తెలంగాణ రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు