ఎలక్ట్రానిక్స్‌కు నిబంధనాలు

9 Apr, 2014 05:01 IST|Sakshi
ఎలక్ట్రానిక్స్‌కు నిబంధనాలు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ ఉపకరణాల ధరలు భారత్‌లో స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. అంతే గాక వివిధ దేశాల్లో ఆవిష్కరించిన ఉత్పత్తుల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న భారతీయులు మరికొంత కాలం వేచి ఉండక తప్పదు. దీనికి కారణం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) 2014 మార్చి 25న చేసిన సవరణ ఉత్తర్వులే. ఉత్పత్తితోపాటు ప్యాక్‌పైన బీఐఎస్ నాణ్యత ధ్రువీకరణ వివరాలను స్టిక్కర్లకు బదులు స్క్రీన్ ప్రింట్, అక్షరాలు తాకేలా(ఎంబోస్) లేదా చెక్కినట్టుగా ముద్రించడం తప్పనిసరి చేస్తూ రూపొందిన ఉత్తర్వులతో పరిశ్రమ ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. ఆచరణసాధ్యం కాని, ప్రపంచంలో ఎక్కడా లేని నిబంధనలు అంటూ కంపెనీలు గుర్రుగా ఉన్నాయి. బీఐఎస్ నిబంధనలు ట్యాబ్లెట్ పీసీలు, ల్యాప్‌టాప్‌లు, నోట్‌బుక్స్, 32 అంగుళాలు ఆపైన సైజున్న ప్లాస్మా, ఎల్సీడీ, ఎల్‌ఈడీ టెలివిజన్లతోపాటు సెట్‌టాప్ బాక్సులు, ప్రింటర్లు, స్కానర్ల వంటి ఉత్పత్తులకు వర్తిస్తుంది.   

 ఆచరణ సాధ్యంకాదు..
 కంపెనీలు తమ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు మారుస్తుంటాయి. అదనంగా ఫీచర్లను, సామర్థ్యాన్ని జోడించి మోడళ్లను తీసుకురావడం సహజం. ఉత్పత్తులు వివిధ ఫ్యాక్టరీల్లో తయారవుతుంటాయి. చెక్కినట్టు ముద్ర ఉండాలంటే అన్ని ప్లాంట్లలోనూ అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్స్‌ను సరఫరా చేసే యూనిట్లలో ప్రతిపాదిత లేబులింగ్ వ్యవస్థ లేదని మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎంఏఐటీ) ప్రెసిడెంట్, లెనోవో ఇండియా ఎండీ అమర్ బాబు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కంపెనీలకు మరికొంత సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, బీఐఎస్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారమే తయారు చేశామనే ప్రకటనను ఉపకరణంపై ప్రముఖంగా ముద్రించాలని ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. అక్షరాలా సైజు 12 లేదా బ్రాండ్ పేరులో 1/4వ వంతు ఉండాల్సిందే. కనీస సైజు 6కు తగ్గకూడదు. ట్యాంపర్ ప్రూఫ్ స్టిక్కర్లు లేదా ప్లాస్టిక్ లేబుల్స్ చక్కని పరిష్కారమని వీడియోకాన్ సూచిస్తోంది.

 కొత్తవి మరింత ఆలస్యం..: ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు దాదాపుగా విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. లేదా విడి భాగాలను కొనుగోలు చేసి ఇక్కడి కంపెనీలు  అసెంబుల్ చేస్తున్నాయి. ఒక ఉత్పత్తి పనితీరును పరిశీలించి సమస్యలు లేవని భావిస్తేనే ఏ కంపెనీ అయినా వాటికి ఆర్డరు ఇస్తుంది. అయితే ఆర్డరు ఇచ్చే ముందే ఒక శాంపిల్‌ను సేకరించి బీఐఎస్‌కు పంపించాల్సిన పరిస్థితి ఇప్పుడు తలెత్తింది. ధ్రువీకరణ వచ్చేంత వరకు ఆర్డరు ఇవ్వలేని స్థితి అన్నమాట. ఈ లెక్కన నూతన ఆవిష్కరణలు సహజంగానే ఆలస్యం అవుతాయి. ఉపకరణాలకు కొరత వస్తుందని అమర్ బాబు పేర్కొన్నారు.

అంతర్జాతీయంగా ఆవిష్కరించినప్పటికీ, భారత్‌లో తేవడానికి సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం గనక నిబంధనలు సడలించకపోతే ధరలు పెరగడం ఖాయమని హెచ్చరించారు. అదనంగా అయ్యే వ్యయం కస్టమర్లపై మోపడం తప్ప మరో మార్గం లేదని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ఉత్పత్తులను పరీక్షించే లేబొరేటరీలు దేశవ్యాప్తంగా 11 మాత్రమే ఉన్నాయి. దీంతో వందలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 2 నెలలకుపైగా సమయం అయినా ఇంత వరకు తమ దరఖాస్తు ముందుకు కదల్లేదని ఒక కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు.
 
 వాటికి బీఐఎస్ తప్పనిసరి..
 కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గూడ్స్ (నిర్బంధ నమోదు ఆవశ్యకతలు) ఉత్తర్వు-2012 ప్రకారం 15 రకాల ఉత్పత్తులకు బీఐఎస్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. 2014 ఏప్రిల్ 4 నుంచి ఇవి అమలులోకి వచ్చాయి. కంపెనీ ఏ దేశానికి చెందినదైనా భారత్‌లో ఉత్పత్తులను విక్రయించాలంటే బీఐఎస్ నాణ్యత ప్రమాణాలను పాటించాల్సిందే. ఇందుకోసం కంపెనీలు తమ ఉత్పత్తులను బీఐఎస్ ల్యాబొరేటరీల్లో పరీక్షించి ధ్రువీకరణ పొందాలి.

ఉత్పత్తిపై ఇండియన్ స్టాండర్డ్ ప్రమాణాల ప్రకారం తయారైందని చెప్పే సెల్ఫ్ డిక్లరేషన్‌ను ముద్రించాల్సి ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన్ లేని ఉత్పత్తులను తయారు చేయడం నిషేధం. నిల్వ, విక్రయం, దిగుమతి, పంపిణీ చేపట్టినా చట్ట పరంగా చర్యలు తీసుకుంటారు. మార్కెట్లో శాంపిళ్లను సేకరించి బీఐఎస్ అనుమతి ఉన్న టెస్టింగ్ ల్యాబ్‌లకు పంపిస్తారు. నాణ్యత లోపించినట్టు తేలితే ఉత్పత్తులను సీజ్ చేస్తారు. ఈ వివరాలను బీఐఎస్ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.

మరిన్ని వార్తలు