చైనా ఆధిపత్యానికి ‘మందు’

22 Feb, 2018 00:31 IST|Sakshi
భారత్‌, చైనా

భారీ అవకాశాలతో ఊరిస్తున్న డ్రాగన్‌

నియంత్రణ పరంగానూ పలు అనుకూలతలు

ప్రాధాన్యాన్ని మార్చుకుంటున్న కంపెనీలు

చైనా మార్కెట్లోకి కొత్త ఔషధాల విడుదల

న్యూఢిల్లీ: ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫార్మా మార్కెట్‌ అయిన చైనాను మన కంపెనీలు ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. కాకపోతే స్వీయ రక్షణలతో అమెరికా మార్కెట్లో అమ్మకాలు తగ్గటం... కొత్త మార్కెట్లు, కొత్త అవకాశాల కోసం అన్వేషించాల్సి రావటంతో వీటి దృష్టి డ్రాగన్‌ దేశంపై పడింది. ఫలితం... 100 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా మార్కెట్‌లో వాటా పెంచుకునేందుకు, బలోపేతం అయ్యేందుకు ఇవి ప్రయత్నాల్ని తీవ్రం చేశాయి. ఇప్పటికే సిప్లా, లుపిన్‌ సంస్థలు చైనా మార్కెట్లో నూతన అవకాశాల అన్వేషణలో ఉండగా, ఈ జాబితాలో డాక్టర్‌ రెడ్డీస్‌ కూడా చేరిపోయింది.

ప్రపంచంలో అతిపెద్ద ఫార్మా మార్కెట్‌ అమెరికాలో భారత కంపెనీల హవా కొనసాగుతుండగా... రెండో అతిపెద్ద చైనా మార్కెట్‌లో మాత్రం స్థానిక కంపెనీలు, బహుళజాతి కంపెనీల ఆధిపత్యమే కొనసాగుతోంది. 100 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా మార్కెట్లో (సుమారు రూ.6.4 లక్షల కోట్లు) భారత ఫార్మా కంపెనీల ఎగుమతుల వాటా 160 మిలియన్‌ డాలర్లు (రూ.1,024 కోట్లు) మాత్రమే. ఇటీవల నియంత్రణల పరంగా చేసిన మార్పులతో ఉత్పత్తులకు అనుమతులు వేగవంతం కావడం మొదలైంది. దీంతో చైనా మార్కెట్‌ భారత ఔషధ కంపెనీలను భారీ అవకాశాలతో ఊరిస్తోంది.  

విదేశీ ట్రయల్‌ డేటాను (ఔషధ పరీక్షల సమాచారం) గుర్తించడంతోపాటు, ఔషధ అనుమతులను వేగవంతం చేసేందుకు మరింత మందిని నియమించుకోవాలని చైనా ఆహార, ఔషధ నియంత్రణ మండలి ఇటీవలే నిర్ణయించింది. ఇది భారత ఔషధ కంపెనీలకు మేలు చేసేదేనని నిపుణులు చెబుతున్నారు. భారత కంపెనీలు ఇప్పటి వరకు ప్రధానంగా అమెరికా, యూరోప్‌ మార్కెట్లపైనే ఎక్కువగా ఆధారపడ్డాయి. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి ఆమోదించిన ఔషధాలను చైనాలోనూ వేగంగా అనుమతిలిచ్చేందుకు వీలుగా కొత్త నియంత్రణలు రావడం భారత కంపెనీలు డ్రాగన్‌ మార్కెట్‌లో పాతుకుపోవడానికి వీలు కల్పిస్తాయని ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌కు చెందిన శ్రీరామ్‌ శ్రీనివాసన్‌ పేర్కొన్నారు.  

భారత కంపెనీల ప్రయత్నాలు
కొత్త అవకాశాల నేపథ్యంలో చైనా మార్కెట్లో యాంటీ కేన్సర్‌ ఔషధాలను ప్రవేశపెట్టేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ ప్రయత్నిస్తోంది. సిప్లా, వోకార్డ్‌ యాంటీ బయోటిక్స్, రెస్పిరేటరీ ఔషధాలను విడుదల చేయాలనుకుంటున్నాయి. ‘‘అంకాలజీ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన విభాగం. చైనాలో మా స్థానం మరింత బలోపేతం అయ్యేందుకు వీలుగా భాగస్వామ్య ఒప్పందాల కోసం చూస్తున్నాం’’ అని డాక్టర్‌ రెడ్డీస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంవీ రమణ తెలిపారు. వాస్తవానికి డాక్టర్‌ రెడ్డీస్‌ 20 ఏళ్ల నుంచి చైనా మార్కెట్లో ఉంది. 2 కోట్ల డాలర్ల (రూ.130 కోట్లు) విలువైన ఔషధాలను మార్కెట్‌ చేస్తోంది. ఇందులో యాక్టివ్‌ ఫార్మాస్యూటిక్‌ ఇంగ్రేడియెంట్స్‌ అమ్మకాలు కలిపిలేవు. రోటమ్‌ గ్రూపుతో కలసి జాయింట్‌ వెంచర్‌ కింద ఉత్పత్తులను మార్కెట్‌ చేస్తోంది.

చైనాలోని 5,000 ఆస్పత్రులను కవర్‌ చేసే మార్కెటింగ్‌ బృందం కూడా ఉంది. ఇతర భారతీయ కంపెనీల పాత్ర డాక్టర్‌ రెడ్డీస్‌తో పోలిస్తే నామమాత్రమే. ర్యాన్‌బ్యాక్సీ (2014లో సన్‌ ఫార్మా సొంతమైంది) చైనా మార్కెట్లోకి ప్రవేశించినప్పటికీ 2009లో జాయింట్‌ వెంచర్‌ నుంచి తప్పుకుని, తన వాటాను భాగస్వామ్య కంపెనీకే అమ్మేసింది. కఠిన నియంత్రణల వల్ల చైనా మార్కెట్లో ఔషధాల విడుదల ప్రణాళికలను టోరెంట్‌ అటకెక్కించేసింది. 2013లో ఓ చైనా కంపెనీతో చర్చలు ప్రారంభించగా, తర్వాత అర్ధంతంగా ఆగిపోయాయి. ఇక సిప్లా సైతం చైనాలో రెండు పెట్టుబడుల నుంచి పక్కకు తప్పుకుంది. అయినప్పటికీ ఈ సంస్థ కోర్‌ థెరపీ ఔషధాల విడుదలతో మరోసారి పోటీపడే ప్రయత్నాలు చేస్తోంది. కొనుగోలు లేదా భాగస్వామ్యం ద్వారా రెస్పిరేటరీ ఔషధాలను విడుదల చేయాలనుకుంటోంది. వోకార్డ్‌ యాంటీ బయోటిక్‌ ఔషధాలను ఎగుమతి చేసే ఆలోచనతో ఉంది. ఇందుకోసం స్థానిక కంపెనీలతో క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం చర్చలు జరుపుతోంది. ఐదు యాంటీ బయోటిక్‌ ఔషధాలను అభివృద్ధి చేస్తోంది. 

ఇప్పటికీ సవాలే?
చైనాలో నిర్వహణ వాతావరణం ఇప్పటికీ సవాళ్లతో కూడినదేనని అంతర్జాతీయ వైద్య సేవల సంస్థ ఐక్యూవీఐఏ పేర్కొంది. అయితే, బలమైన డిమాండ్, ఇన్నోవేటివ్‌ ఉత్పత్తులకు సత్వర అనుమతులు అన్నవి ఔషధ కంపెనీలను ఆకర్షిస్తున్నాయని తెలిపింది. సంస్కృతికి సంబంధించిన సవాళ్లు, మార్కెట్‌ ఏకీకృతంగా లేకపోవడం అవరోధమన్న అభిప్రాయాలున్నాయి. యూరోప్, జపాన్‌ మార్కెట్లో అధిక అవకాశాలు ఉండటం, చైనా మార్కెట్లో ఇబ్బందుల వల్ల ఆదేశ మార్కెట్‌పై భారత కంపెనీలు ఇప్పటి వరకు పెద్దగా దృష్టి పెట్టలేదని భారత ఫార్మాస్యూటికల్‌ అలియన్స్‌ జనరల్‌ సెక్రటరీ డీజీషా చెప్పారు. దీనిపై వోకార్డ్‌ ఛైర్మన్‌ హబిల్‌ ఖొరాకివాలా స్పందిస్తూ...  ‘‘చైనాలో అవకాశాలు వెదుకుతున్నాం. ఎందుకంటే యాంటీ బయోటిక్స్‌కు ఇది భారీ మార్కెట్‌’’ అని చెప్పారు. విలువ పరంగా అమెరికాతో పోలిస్తే చైనా యాంటీ బయోటిక్స్‌ ఔషధ మార్కెట్‌ విలువ రెట్టింపు స్థాయిలో ఉంది.  

మరిన్ని వార్తలు