1,000 పెట్టుబడి.. 20.9 లక్షల రాబడి

24 Dec, 2017 12:09 IST|Sakshi
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కోకిలాబెన్‌. చిత్రంలో ఈషా, ఆకాశ్, అనంత్‌

ఘనంగా రిలయన్స్‌ 40వ వార్షిక వేడుకల్లో ముకేశ్‌ అంబానీ

ముంబై: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ గ్రూప్‌ 40వ వార్షిక వేడుకలు అట్టహాసంగా నిర్వహించింది. వ్యవస్థాపకుడు ధీరుభాయ్‌ అంబానీకి నివాళులర్పించింది. ధీరుభాయ్‌ సతీమణి కోకిలా బెన్, కొడుకు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ కుటుంబసభ్యులు ఇందులో పాల్గొన్నారు.

ధీరుభాయ్‌ దార్శనికత, లక్ష్యాలు, సూత్రాలకు రిలయన్స్‌ గ్రూప్‌ కట్టుబడి ఉంటుందని  ఈ సందర్భంగా ముకేశ్‌ అన్నారు. రూ. 1,000తో ప్రారంభమైన కంపెనీ నేడు రూ. 6 లక్షల కోట్ల స్థాయికి ఎదిగిందన్నారు. 1977లో ఆర్‌ఐఎల్‌లో రూ. 1,000 ఇన్వెస్ట్‌ చేసిన వారి పెట్టుబడి విలువ ప్రస్తుతం 2009 రెట్లు పెరిగి రూ. 20.9 లక్షల స్థాయికి చేరిందన్నారు. ప్రపంచంలోని టాప్‌ 20 కంపెనీల్లో రిలయన్స్‌ను నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రకటించారు.

డిసెంబర్‌ 28 ధీరుభాయ్‌ జయంతి సందర్భంగా రిలయన్స్‌ కార్పొరేట్‌ పార్క్‌లో నిర్వహించిన వార్షిక వేడుకలకు 50 వేల మందిపైగా హాజరయ్యారు. బాలీవుడ్‌ సూపర్‌స్టార్స్‌ అమితాబ్, షారుఖ్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 1,200 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. 

మరిన్ని వార్తలు