జియో-బీపీ పేరుతో రిలయన్స్‌ పెట్రోలు బంకులు 

17 Dec, 2019 14:24 IST|Sakshi

సాక్షి, ముంబై: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) తన ఇంధన రిటైల్ వ్యాపారాన్ని బ్రిటిష్ ఇంధన ప్రధాన సంస్థ బీపీతో తుది ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. ఈ ఏడాది ఆగస్టులో ప్రాధమిక ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఆర్‌ఐఎల్, బీసీ సోమవారం ఒక ఖచ్చితమైన ఒప్పందంపై సంతకం చేశాయని రిలయన్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. జియో-బీపీ బ్రాండ్‌ ఇంధన మార్కెటింగ్, మొబిలిటీ సొల్యూషన్స్‌ ద్వారా వేగంగా అభివృద్ది చెందుతున్న భారత మార్కెట్‌ మరింత అభివృద్ది చెందనుందని   ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌  అంబానీ తెలిపారు.

రెగ్యులేటరీ, ఇతర ఆమోదాలకు లోబడి, 2020 మొదటి భాగంలో జియో-బీపీ జాయింట్ వెంచర్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ జాయింట్‌ వెంచర్‌లో ఆర్‌ఐఎల్ 51 శాతం, బీపీ 49 శాతం వాటా ఉంటుంది. ఈ వాటా కోసం బీపీ రూ.7,000 కోట్లను వెచ్చించనుంది. ప్రస్తుతం ఆర్‌ఐఎల్‌కు దేశవ్యాప్తంగా 1,400 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. వీటితో కలిపి మొత్తం 5,500 పెట్రోల్‌ బంకులను  జాయింట్‌ వెంచర్‌ ద్వారా అందుబాటులోకి  తేవాలని లక్ష్యం. ఈ జాయింట్ వెంచర్ ద్వారా భారతీయ వినియోగదారులకు అధిక-నాణ్యత విభిన్న ఇంధనాలు, ఇతర సేవలను అందించనున్నామని ఆర్ఐఎల్ తెలిపింది. కాగా ముకేష్ అంబానీ నేతృత్వంలోని మరో సంస్థ రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌) కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, దాని టవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్‌లోని సంస్థాగత భాగస్వాముల నుండి రూ .25,215 కోట్ల పెట్టుబడులను సాధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు