అనిల్ అంబానీ కీలక నిర్ణయం : రుణ వ్యాపారానికి గుడ్‌బై 

1 Oct, 2019 10:19 IST|Sakshi

సాక్షి, ముంబై: రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రుణ వితరణ వ్యాపారానికి గుడ్ బై చెప్పాలని రిలయన్స్ కేపిటల్ నిర్ణయించినట్టు తెలిపారు. సోమవారం జరిగిన కంపెనీ వాటాదారుల వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) ఈ మేరకు ప్రకటించిన అంబానీ రిలయన్స్ క్యాపిటల్ తన రుణ వ్యాపారాలన్నింటిని నుంచి డిసెంబర్ నాటికి నిష్క్రమిస్తుందని చెప్పారు. గత ఆరు నెలల్లో చోటు చేసుకున్న ప్రతికూల సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అనిల్‌ మాట్లాడుతూ మందగించిన ఆర్థిక వ్యవస్థ, ఈ రంగంలో రుణాల సంక్షోభంతో రిలయన్స్‌ క్యాపిటల్‌ నష్టాన్ని ఎదుర్కోందని తెలిపారు. రిలయన్స్ క్యాపిటల్ ఇకపై రుణ వ్యాపారంలో ఉండదని నిర్ణయించింది. రుణ వ్యాపారాలు - రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్  రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ - డిసెంబరు నాటికి పూర్తవుతాయని భావిస్తున్నామని వార్షిక సర్వసభ్య సమావేశంలో అంబానీ వాటాదారులకు చెప్పారు. రిలయన్స్ క్యాపిటల్  అప్పు రూ .25 వేల కోట్లు తగ్గుతుందని అంబానీ చెప్పారు.

అలాగే ప్రభుత్వం వచ్చే అయిదేళ్లలో మౌలిక సదుపాయాలపై రూ.100 లక్షల కోట్లు ఖర్చు చేయడం ఆర్ఇన్ఫ్రాకు కలిసి వస్తుందనీ, రక్షణ రంగంలో మరిన్ని వ్యాపార అవకాశాలు తమకు లభిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. దేశంలో అత్యుత్తమ 5 ప్రైవేటు రక్షణ కంపెనీల్లో ఒకటిగా ఎదగాలని భావిస్తున్నామన్నారు. ఆధునాతన సాంకేతికను అందిపుచ్చుకొని అంతర్జాతీయ సరఫరా సంస్థగా మారతా మన్నారు.  రిలయన్స్ క్యాపిటల్ ప్రస్తుతం చిన్న, మధ్యతరహా సంస్థలకు రిలయన్స్ మనీ ద్వారా, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ద్వారా గృహ కొనుగోలుదారులకు రుణాలు ఇస్తుంది. ఈ రెండు వ్యాపారాలు గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయంలో 15 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ ఏడాది కంపెనీ ఆస్తులను డిజిస్ట్‌మెంట్‌ చేయనుంది. రిలయన్స్ క్యాపిటల్ తన మ్యూచువల్ ఫండ్ విభాగమయిన రిలయన్స్ నిప్పోన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ (ఆర్‌నామ్)లోని 21.54 శాతం వాటా విక్రయాన్ని పూర్తి చేసినట్లు కంపెనీ ఇటీవల  ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా అనిల్ అంబానీ నేతృత్వంలోని  అడాగ్‌గ్రూపులో మూతపడనున్న రెండవ పెద్ద వ్యాపారం ఇది.  ఇప్పటికే ప్రధానమైన రిలయన్స్ కమ్యూనికేషన్ రెండేళ్ల క్రితం మూత పడి దివాలా ప్రక్రియలో ఉంది. ఇక  రక్షణ వ్యాపారం - రిలయన్స్ నావల్ - కూడా తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి లోనవుతుంది.

మరిన్ని వార్తలు